EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 20 నెలలుగా అందని వేతనాలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ల ఆకలి కేకలు..?

    Author THADEM PRASHANTH | 13 Oct 2026, 09:32 PM | TELANGANA
    20 నెలలుగా అందని వేతనాలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ల ఆకలి కేకలు..?

    ​

    రోగులకు నిరంతరాయంగా రక్త పరీక్షల సేవలు అందిస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం
    ​

    కుటుంబ పోషణ భారమై అప్పుల ఊబిలోకి ఉద్యోగులు.. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్
    ​సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా):
    ప్రజారోగ్య వ్యవస్థలో రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల ల్యాబ్ టెక్నీషియన్ల పట్ల వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర ఉదాసీనత కనబరుస్తోంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు గత 20 నెలలుగా ఒక్క రూపాయి కూడా వేతనం అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదని, జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు అందరికీ దాదాపు రెండేళ్లుగా జీతాలు నిలిచిపోయాయని సిబ్బంది వాపోతున్నారు.
    ​ప్రతిరోజూ ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వేలాది మంది గ్రామీణ పేద రోగులకు రక్త, మూత్ర మరియు వివిధ అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్సలో వెన్నెముకలా నిలుస్తున్న సిబ్బందిని పాలకులు విస్మరించడం దారుణమని మండిపడుతున్నారు. నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, 20 నెలల పాటు జీతాలు ఆపేయడంతో కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని టెక్నీషియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకుల ఖర్చులు, పిల్లల చదువుల ఫీజులు చెల్లించలేక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామని, రోజువారీ అవసరాల కోసం అప్పులు తెచ్చి వాటికి వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. ఒకటి రెండు నెలలు వేతనం ఆలస్యమైతేనే ఉద్యోగులు అల్లాడిపోయే పరిస్థితి ఉన్న నేటి రోజుల్లో, ఏకంగా 20 నెలల పాటు జీతం ఇవ్వకుండా విధులు చేయించుకోవడం వెట్టిచాకిరీని తలపిస్తోందని విమర్శిస్తున్నారు.
    ​జిల్లా వ్యాప్తంగా ఇంతమంది ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నా ఉన్నతాధికారుల్లో, ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల 20 నెలల వేతన బకాయిలను వెంటనే విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిబ్బందితో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰