EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల మత్తడి స్థలం ఎవరి ఆధీనంలో?.. మున్సిపాలిటీదా..ముత్తిరెడ్డి దా..??

    Author P శివశంకర్ | 25 Sep 2026, 05:57 PM | TELANGANA
    చేర్యాల మత్తడి స్థలం ఎవరి ఆధీనంలో?.. మున్సిపాలిటీదా..ముత్తిరెడ్డి దా..??

    హిందుస్థాన్ మీడియా ప్రత్యేక కథనం

    ఏళ్లుగా తేలని పెద్ద చెరువు సర్వే నం. 1402 1402/A/1/1 మరియు 1402/A/1/2 భూ వివాదం

    నాడు ముత్తిరెడ్డి కుమార్తె హామీ...

    నేడు అధికారిక బదలాయింపుపై వీడని సందిగ్ధత

    రికార్డులు బహిర్గతం చేసి ప్రజాప్రయోజనాలకు కేటాయించాలని పట్టణ
    ప్రజల డిమాండ్

    మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్నట్లయితే అధికారిక బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
    చేర్యాల (హిందుస్థాన్ మీడియా బ్యూరో):

    చేర్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు మత్తడి పరిధిలోని స్థలం వ్యవహారం ఏళ్లు గడుస్తున్నా ఇంకా సందిగ్ధంలోనే మగ్గుతోంది. సర్వే నంబర్‌లు 1402,1402/A/1/1 మరియు 1402/A/1/2 లోని ఈ కీలక స్థలం ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని పేరున 1270.0 చ॥గ॥ మరియు మారుతి ప్రసాద్, జితేందర్ రెడ్డి పేరున 1270.0 చ॥గ॥ ఖాళీస్థలం2020లో రిజిష్ట్రీ చేసారు. దీనితో చేర్యాలలో అఖిలపYక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. దీనితో తుల్జాభవాని ఇట్టి స్థలాన్ని తిsరిగి మున్సిపల్ కే అప్పగిస్తానని ప్రకటించింది.మరి ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరిట ఉంది? భౌతికంగా ఎవరి ఆధీనంలో ఉంది? మున్సిపాలిటీకి అధికారికంగా బదలాయింపు ప్రక్రియ పూర్తయిందా? అనే ప్రశ్నలు పట్టణ ప్రజల్లో విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి. ప్రజా అవసరాలకు వినియోగపడాల్సిన భూమిపై అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయి రికార్డులతో కూడిన స్పష్టతనిచ్చి వివాదానికి శాశ్వత ముగింపు పలకాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    వివాద నేపథ్యం -- సంత స్థలంపై రగడ
    గతంలో గ్రామపంచాయతీ కాలంలో ఈ ఖాళీ స్థలంలో వారపు పశువుల సంత నిర్వహించేవారు. ప్రజా అవసరాలకు వేదికగా ఉన్న ఈ స్థలం 2020 ప్రాంతంలో తీవ్ర వివాదానికి కేంద్రబిందువైంది. అప్పటి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం స్థానికంగా తీవ్ర ఆరోపణలు, రాజకీయ ఆందోళనలు వెల్లువెత్తాయి. చేర్యాల పరిరక్షణ పేరుతో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు చేపట్టిన ఉద్యమాలతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    హామీ నెరవేరిందా? కాగితాలకే పరిమితమైందా?
    2023లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి స్వయంగా రంగంలోకి వచ్చి తన పేరిట ఉన్న ఈ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తానని బహిరంగంగా ప్రకటించిన సంగతి పాఠకులకు విదితమే. అయితే ఆ ప్రకటన వెలువడి ఏళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే దానిపై అధికారిక సమాచారం కొరవడింది.
    సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ రద్దు లేదా మున్సిపాలిటీ పేరిట గిఫ్ట్ డీడ్ అధికారికంగా జరిగిందా?
    భూ భారతి రికార్డులలో మున్సిపాలిటీ పేరిట యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయా?
    సదరు భూమిపై మున్సిపల్ యంత్రాంగానికి చట్టబద్ధమైన భౌతిక స్వాధీనం లభించిందా?అనే ప్రశ్నలపై నేటికీ మున్సిపల్ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.

    చేర్యాల మత్తడి స్థలం ఎవరి ఆధీనంలో?.. మున్సిపాలిటీదా..ముత్తిరెడ్డి దా..?? - Additional Image

    ఉద్యమకారుల త్యాగాలకు ఫలితమేది?

    ఇవి కూడా చదవండి

    మత్తడి స్థలాన్ని కాపాడేందుకు గతంలో అనేకమంది ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు లాఠీదెబ్బలు తిని, పోలీసు కేసులు ఎదుర్కొన్నారు. కొందరు నేతలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఇంతటి పోరాటం జరిగినా, ఫలితం ఎవరి ఖాతాలోకి వెళ్లిందో ప్రజలకు అంతుచిక్కడం లేదు. స్థలం మున్సిపాలిటీ సొత్తయితే, దానిని నేటికీ ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయకపోవడానికి కారణాలేంటని స్థానికులు నిలదీస్తున్నారు.

    వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలి
    మరోవైపు పెద్ద చెరువు మత్తడి ప్రాంతం వర్షాకాలంలో తీవ్ర వరద ప్రవాహం ఉండే అత్యంత సున్నితమైన ప్రదేశం. గతంలో ఇక్కడ కాలువ అలైన్‌మెంట్, నీటి మళ్లింపుపై వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ సరిహద్దులను పక్కాగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది.

    కమిషనర్, పాలకవర్గం తేల్చాలి: ప్రజల డిమాండ్
    ఈ వివాదానికి తెరపడాలంటే ఇక ప్రకటనలు కాకుండా అధికారిక రికార్డులే మాట్లాడాలని చేర్యాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
    సర్వే నం. 1402 భూమి ప్రస్తుత రెవెన్యూ హోదా ఏమిటి?
    మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్నట్లయితే అధికారిక బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
    ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు ఎందుకు చేపట్టడం లేదు?
    ఈ ప్రశ్నలపై చేర్యాల మున్సిపల్ కమిషనర్, ప్రస్తుత పాలకవర్గం తక్షణమే సమగ్ర అధికారిక ప్రకటన విడుదల చేయాలని, లేనిపక్షంలో మళ్లీ ప్రజాక్షేత్రంలో
    ఉద్యమబాట పట్టక తప్పదని స్ధానిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.