EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చినుకు పడితే చాలు.... గాంధీ ఏరియా చెరువే..!

    Author P శివశంకర్ | 24 Sep 2026, 06:40 PM | TELANGANA
    చినుకు పడితే చాలు.... గాంధీ ఏరియా చెరువే..!

    ఇళ్ల మధ్య నిలిచిపోతున్న వర్షపు నీరు.. రోగాల భయంతో స్థానికుల ఆందోళన
    ​

    వర్షంలో తడుస్తూ రోడ్డుపై ధర్నా చేసినా అధికారుల్లో చలనం లేదు!
    ​

    శాశ్వత డ్రైనేజీ నిర్మించి మురుగు కాలువలకు నీటిని మళ్లించాలని కాలనీవాసుల డిమాండ్
    ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    ​

    నీటిమడుగుగా మారుతున్న గాంధీ ఏరియా – యూనియన్ బ్యాంక్ పరిసరాలు
    ​చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు గాంధీ ఏరియా మరియు యూనియన్ బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య స్థానికులకు నిత్య నరకంగా మారింది. ఆకాశంలో కాస్త మబ్బు పట్టి ఒక్క చినుకు రాలినా సరే.. ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపిస్తోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోయేందుకు సరైన మురుగు కాలువల వ్యవస్థ లేకపోవడంతో వరద నీరంతా ఇళ్ల చుట్టూ, వీధుల్లోనే నిలిచిపోయి నివాస ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
    ​దుర్వాసన.. దోమల బెడదతో రోగాల భయం
    ​ఇళ్ల నడుమ రోజుల తరబడి వర్షపు నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర జ్వరాలు ప్రబలే ముప్పు పొంచి ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు అడుగు పెట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ నీటి వల్ల ఇళ్ల పునాదులు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
    ​ఎన్ని ధర్నాలు చేసినా రాని స్పందన!
    ​ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా పరిస్థితిలో మార్పు రాలేదని కాలనీవాసులు మండిపడుతున్నారు. గతంలో కుండపోత వర్షంలో సైతం రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు చేపట్టినా సంబంధిత అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చే నాయకులు.. కనీస వసతులైన కాలువలు, డ్రైనేజీల నిర్మాణాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    ​

    మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలి
    ​ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగాలని స్థానికులు కోరుతున్నారు.
    ​ఇళ్ల మధ్య నిలిచి ఉన్న వరద నీటిని సమీప కాలువల్లోకి తరలించి, దోమల నివారణకు బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టి,శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరుతున్నారు.
    ​గాంధీ ఏరియా సమస్యను ఇప్పటికైనా పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰