EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దుర్వాసనకు, ప్రమాదాలకు నిలయంగా హయత్‌నగర్‌–మదర్‌డెయిరీ రోడ్డు

    Author V RAMESH | 23 Sep 2026, 02:49 PM | TELANGANA
    దుర్వాసనకు, ప్రమాదాలకు నిలయంగా హయత్‌నగర్‌–మదర్‌డెయిరీ రోడ్డు

    లోతైన నాలా చుట్టూ చెత్తాచెదారం.. పిచ్చిమొక్కలతో ప్రమాదకర పరిస్థితి

    చిన్న బోర్డుతో సరిపెట్టిన అధికారులు.. అడ్డుగోడ ఎక్కడ?

    వై జంక్షన్‌ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు శుభ్రం చేయాలని స్థానికుల డిమాండ్‌
    హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 23, హిందుస్థాన్ మీడియా:
    హయత్‌నగర్‌ నుంచి కుంట్లూర్‌ వైపు వెళ్లే మదర్‌డెయిరీ రహదారి పరిసరాలు సమస్యలకు నిలయంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో సబ్‌స్టేషన్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న లోతైన నాలా ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.
    నాలా చుట్టూ చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు భారీగా పేరుకుపోవడంతో రహదారి, నాలా మధ్య ఉన్న ప్రాంతం స్పష్టంగా కనిపించకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. రహదారిని అనుకుని ఉన్న ప్రాంతం నాలా అని గుర్తించలేక వాహనదారులు ప్రమాదవశాత్తు నాలాలో పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    చిన్న బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారా?
    ప్రమాదకరమైన నాలా వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు కేవలం ఒక చిన్న హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని, అయితే నాలా చుట్టూ రక్షణ గోడ లేదా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
    చెత్తతో దుర్వాసన.. దోమల బెడద
    నాలా పరిసర ప్రాంతాల్లోకి బయట ప్రాంతాల నుంచి వచ్చి కొందరు చెత్తను పడేస్తుండటంతో భారీగా చెత్త పేరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో దుర్వాసన, దోమలు, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాకు ఎదురుగా ఉన్న కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
    చెత్త పేరుకుపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు క్రమం తప్పకుండా శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

    ఇకనైనా అధికారులు స్పందించాలి
    వై జంక్షన్‌ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు రహదారి పరిసరాలను తక్షణమే శుభ్రం చేయడంతో పాటు నాలా చుట్టూ పటిష్టమైన అడ్డుగోడ లేదా రక్షణ బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అవసరమైన చోట నాలాపై సురక్షితమైన వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
    ప్రజల రాకపోకలకు కీలకమైన రహదారి కావడంతో పాటు విద్యార్థులు, వాహనదారులు నిత్యం ప్రయాణించే మార్గం కావడంతో అధికారులు ఇకనైనా స్పందించి ప్రమాదాలు జరగకముందే శాశ్వత పరిష్కారం చూపాలని పరిసర ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.