EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళా మండలి కొనుగోలు చేసిన ట్రాక్టర్ నిరుపయోగం!

    Author R K SRINIVAS | 21 Sep 2026, 04:53 PM | TELANGANA
    మహిళా మండలి కొనుగోలు చేసిన ట్రాక్టర్ నిరుపయోగం!

    కార్యాలయం ముందు తుప్పు పడుతున్న వాహనం.. మండల ప్రజల ఆగ్రహం

    ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి: గ్రామస్తుల డిమాండ్‌
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్‌ 21, హిందుస్థాన్ మీడియా: మహిళా సంఘాల అభివృద్ధి, ఆదాయ వృద్ధి కోసం మద్దూరు మండల మహిళా మండలి సమాఖ్య ఆధ్వర్యంలో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ ప్రస్తుతం నిరుపయోగంగా మారి కార్యాలయం ముందు తుప్పు పడుతుండటంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ట్రాక్టర్‌ను వినియోగంలోకి తీసుకురాకుండా కార్యాలయం ముందు ఉంచడం వల్ల వాహనం విలువ తగ్గిపోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల ప్రయోజనాల కోసం కొనుగోలు చేసిన వాహనం ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండటంపై అధికారులు స్పందించి కారణాలను వెల్లడించాలని కోరుతున్నారు.
    ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి
    మహిళా మండలి ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. వాహనం నిరుపయోగంగా మారడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహిళా సంఘాల ఆదాయానికి ఉపయోగపడాల్సిన వాహనం కార్యాలయం ముందు తుప్పు పట్టిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
    ట్రాక్టర్‌తో మహిళా సంఘాలకు లాభం లేదు: ఏపీఎం ప్రకాశం
    ఈ విషయంపై ఏపీఎం ప్రకాశంను హిందుస్థాన్‌ మీడియా వివరణ కోరగా.. ప్రస్తుతం ట్రాక్టర్‌ ద్వారా మహిళా సంఘాలకు ఎలాంటి లాభం చేకూరడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మహిళా సంఘాల సీఈవో ఈ అంశంపై విచారణ చేపట్టి, తదుపరి నిర్ణయం తీసుకుంటారని ఏపీఎం ప్రకాశం వెల్లడించారు.