EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇల్లంతకుంట మండలంలో భూముల రీ -సర్వే

    Author THADEM PRASHANTH | 19 Sep 2026, 09:08 PM | TELANGANA
    ఇల్లంతకుంట మండలంలో భూముల రీ -సర్వే

    రైతుల సమక్షంలో ఎంజాయ్‌మెంట్‌ సర్వే విధానంపై అధికారుల అవగాహన

    భూముల హద్దులను రైతులే చూపించాలి.. అభ్యంతరాలకు అప్పీల్‌ అవకాశం
    రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట, సెప్టెంబర్‌ 19, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట్‌, తిప్పాపూర్‌, జంగంరెడ్డిపల్లి, జవహర్‌పేట గ్రామాల్లో భూముల రీ-సర్వే (ఎంజాయ్‌మెంట్‌ సర్వే) నిర్వహణకు సంబంధించి శనివారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియ, రైతులు పాటించాల్సిన విధానాలు, సర్వే సమయంలో అందించాల్సిన ఆధారాలపై అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
    అన్ని సర్వే నంబర్లకు ఎంజాయ్‌మెంట్‌ సర్వే
    గ్రామాల్లోని అన్ని సర్వే నంబర్లకు ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దులు, అనంతరం గ్రామకంఠం, ప్రభుత్వ భూములు, ఆ తర్వాత పట్టా భూములను సర్వే చేయనున్నట్లు వివరించారు.
    సర్వే సమయంలో రైతులు తమ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాల జిరాక్స్‌ ప్రతులను సర్వే బృందానికి అందజేయాలని సూచించారు. ఏ రోజు ఏ సర్వే నంబర్లను పరిశీలించనున్నారనే విషయాన్ని ముందురోజే గ్రామంలో చాటింపు ద్వారా తెలియజేస్తామని తెలిపారు.

    భూమి హద్దులను రైతులే చూపించాలి
    ఎంజాయ్‌మెంట్‌ సర్వే సమయంలో రైతులే తమ భూముల హద్దులను సర్వే బృందానికి చూపించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. సంబంధిత డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోయినా.. రైతులు తాము సాగు చేస్తున్న భూమిని చూపించినట్లయితే, ఆ వివరాలను కూడా సర్వే బృందం నమోదు చేసుకుంటుందని తెలిపారు.
    సర్వే పూర్తయిన అనంతరం సేకరించిన సమాచారాన్ని తహసీల్దార్‌కు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఎంజాయ్‌మెంట్‌ సర్వే ద్వారా రూపొందించిన జాబితాను గ్రామాల్లో రైతులకు తెలియజేస్తామని తెలిపారు.

    అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌ చేసుకోవచ్చు
    సర్వే అనంతరం రూపొందించే జాబితాపై రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిబంధనల ప్రకారం తహసీల్దార్‌ను సంప్రదించి అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. రైతులు సర్వే ప్రక్రియలో అధికారులకు సహకరించి తమ భూములకు సంబంధించిన ఆధారాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
    ఈ గ్రామ సభల్లో తహసీల్దార్‌ సురేష్‌, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, డీఐ వెంకటచారి, సంబంధిత అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.