EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఖమ్మం పల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్

    Author B SRAVAN KUMAR | 19 Sep 2026, 06:21 PM | Array
    ఖమ్మం పల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్

    నేరాల నియంత్రణతో పాటు సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన
    కొండపాక, సెప్టెంబర్ 19:
    జిల్లా ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ శాఖ చేపట్టిన ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 310 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామంలో దాత మంద బూదవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ప్రారంభించారు.
    రిబ్బన్ కట్ చేసి కెమెరాలను ప్రారంభించిన అనంతరం సీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణతో పాటు జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించడంలో కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామాలను 24 గంటలూ నిఘా పరిధిలో ఉంచుతూ ప్రజలకు అదనపు భద్రత కల్పించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు వ్యాపార సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కెమెరాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా వాటి నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సీసీ కెమెరాలకు వెండర్లతో రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు సర్వీస్ కాంట్రాక్ట్ చేసుకోవడం ద్వారా వాటిని నిరంతరం పనిచేసేలా చూసుకోవచ్చని తెలిపారు.

    సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని చెప్పి డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని సీపీ రష్మి పెరుమాళ్ ప్రజలకు సూచించారు. ఎవరైనా ఉద్యోగం లేదా విదేశీ అవకాశాల పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రస్తుతం మొబైల్ ఫోన్లలోనే ఆర్థిక, వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంక్ పిన్‌లు, పాస్‌వర్డ్‌లను ఫోన్లలో సేవ్ చేయవద్దని, బ్యాంకులు ఫోన్ చేసి ఓటీపీ లేదా పిన్ నంబర్లు అడగవని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.
    మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఆందోళన చెందకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు రికవరీకి అవకాశం ఉంటుందని వివరించారు.

    ఖమ్మంపల్లికి అభినందనలు
    గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన మంద బూదవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్, మంద భాస్కర్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని ఇతర గ్రామాలు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ బాబు, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ మొగిలి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.