EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అధికారులను నిలదీసిన మద్దూర్ మండల సర్పంచ్ లు

    Author R K SRINIVAS | 17 Sep 2026, 09:00 PM | TELANGANA
    అధికారులను నిలదీసిన మద్దూర్ మండల సర్పంచ్ లు

    ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించడం లేదంటూ ఆగ్రహం

    గ్రామ సమస్యలపై గత సమావేశంలో చేసిన తీర్మానాల అమలుపైనా ప్రశ్నలు
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్‌ 17, హిందుస్థాన్ మీడియా: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించడం లేదని, గ్రామాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు సర్పంచులకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు సర్పంచులు అధికారులను నిలదీశారు. మద్దూరు మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
    గ్రామాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక సర్పంచులకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్‌ ప్రకారం తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత సమావేశంలో వివిధ గ్రామాల సమస్యలపై తీర్మానాలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    స్థల పరిశీలనకు పిలవలేదంటూ మద్దూరు సర్పంచ్‌ ఆగ్రహం
    మద్దూరు గ్రామ సర్పంచ్‌ దామెర మల్లేశం మాట్లాడుతూ.. స్థానిక సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండానే నూతన తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి అధికారులు స్థల పరిశీలన చేపట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా తనకు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు.
    ప్రోటోకాల్‌ విషయంలో సర్పంచులను అవమానించే విధంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కలెక్టర్‌, ప్రభుత్వం స్థాయిలో ఫిర్యాదు చేయాల్సి వస్తుందని పలువురు సర్పంచులు హెచ్చరించారు.
    మళ్లీ సమస్యలు తలెత్తకుండా చూస్తాం: ఎంపీడీవో
    సర్పంచుల అభ్యంతరాలపై స్పందించిన ఎంపీడీవో రామ్మోహన్‌.. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సమావేశంలో నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్‌ ప్రకారం గౌరవం, సమాచారం ఉండేలా సమన్వయం చేసుకుంటామని తెలిపారు.
    ఈ సమావేశంలో తహసీల్దార్‌ రహీం, ఏపీవో మంజుల, ఎంపీవో వెంకటేశ్వర్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నర్సాయపల్లి సర్పంచ్‌ శనిగరం సత్యనారాయణ, మద్దూరు సర్పంచ్‌ దామెర మల్లేశం, వంగపల్లి సర్పంచ్‌ కొమిరే రామస్వామి, గాగిల్లాపూర్‌ సర్పంచ్‌ ఇట్టబోయిన కనక చంద్రం, రేబర్తి సర్పంచ్‌ నీరటి శ్రీనివాస్, మర్మముల సర్పంచ్‌ సుందరగిరి సత్యనారాయణ, లద్నూర్‌ సర్పంచ్‌ కాసర్ల రేణుక, సలాక్పూర్‌ సర్పంచ్‌ గడపే మౌనిక, వల్లంపట్ల సర్పంచ్‌ కర్నె సునీత, ధర్మారం సర్పంచ్‌ జక్కుల కనకమ్మతో పాటు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.