EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యుత్ సరఫరా కోసం రాజీవ్ రహదారిపై ధర్నా..

    Author B SRAVAN KUMAR | 12 Sep 2026, 08:17 PM | TELANGANA
    విద్యుత్ సరఫరా కోసం రాజీవ్ రహదారిపై ధర్నా..

    సాగుకు 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని రైతుల డిమాండ్‌

    రేపటి నుంచి పాత పద్ధతిలో విద్యుత్‌ సరఫరా చేస్తాం: ఏఈ సత్యం
    సిద్దిపేట జిల్లా, దుద్దెడ, సెప్టెంబర్ 12, హిందుస్థాన్ మీడియా: వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా, రాంపల్లి, దుద్దెడ గ్రామాలకు చెందిన రైతులు శనివారం దుద్దెడ సబ్‌స్టేషన్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఏఈ సత్యంకు వినతిపత్రం అందజేశారు.
    ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి నిర్ణీత సమయం మేరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పటికీ తరచూ అంతరాయాలు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పంటలకు కీలక దశలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో బోర్లు, వ్యవసాయ బావుల ద్వారా పంటలకు సకాలంలో సాగునీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
    పగలు, రాత్రి సమయాల్లో విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని రైతులు పేర్కొన్నారు. వ్యవసాయ బోర్లు, బావులపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు విద్యుత్‌ కోతలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. 12 గంటల పాటు నిరంతరంగా, కోతలు లేకుండా వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.
    రైతుల ఆందోళనపై ఏఈ సత్యం స్పందిస్తూ డీఈతో మాట్లాడినట్లు తెలిపారు. రేపటి నుంచి పాత పద్ధతి ప్రకారం విద్యుత్‌ సరఫరా చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
    విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను పూర్తిగా నివారించి వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ అందించాలని రైతులు అధికారులను కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి రాజీవ్‌ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
    కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ కోఆర్డినేటర్ ర్యాగాల్ల దుర్గయ్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు నూనె కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు నీల సత్యం, దుద్దెడ సర్పంచ్‌ మిద్దె శివకుమార్, అంకిరెడ్డిపల్లి సర్పంచ్‌ గాలి బాలయ్య, నాయకులు తేలు అశోక్, పిడిశెట్టి శ్రీనివాస్, రాసుల రంజిత్, గోనె శ్రీనివాస్, బాలాజీ, నీల వెంకటేష్, ఎలుక రాజిరెడ్డి, గజ్వేల్ కర్ణాకర్ రెడ్డి, గంగుల వెంకటేష్, బట్ట వెంకటేష్, మిద్దె చంద్ర‌మౌళి, మిట్టపల్లి రాజు, నీల హరీష్, గగిల్లాపురం సాయిబాబు, దుద్దెడ నరేష్ గౌడ్, పల్లె యాదగిరితో పాటు ఐదు గ్రామాల రైతులు పాల్గొన్నారు.