EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

    Author THADEM PRASHANTH | 11 Sep 2026, 06:21 PM | TELANGANA
    రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

    వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
    80 ఫీట్ల రోడ్డు, బద్ది పోచమ్మ ఆలయం, నిత్యాన్నదాన సత్రం పనులపై సమీక్ష
    రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
    వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్.. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
    అనంతరం వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు చేపడుతున్న 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. మురుగునీటి కాలువలు, విద్యుత్ టవర్ల నిర్మాణం, రోడ్డు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో పనిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే వివరాలను సేకరించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
    పనులపై ఐడీఓసీలో సమీక్ష
    అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులతో పాటు అధునాతన గోశాల పురోగతిపై వివరాలు సేకరించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
    నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన మేరకు కూలీల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను కూడా పరిశీలించిన కలెక్టర్.. నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
    వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పనుల నాణ్యతను పర్యవేక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
    ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ భీమ్లా నాయక్, డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేష్, నీటిపారుదల శాఖ అధికారి దయాకర్, తహసీల్దార్ జయంత్, రాజన్న ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

    రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ - Additional Image