EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోన్న మద్దూరు ఎంపీడీవో కార్యాలయం

    Author R K SRINIVAS | 24 Aug 2026, 08:15 PM | TELANGANA
    పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోన్న మద్దూరు ఎంపీడీవో కార్యాలయం

    పాములు, విషజీవుల భయంతో ప్రజలు
    అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిన కార్యాలయ ఆవరణ

    సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 24: మండల పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన మద్దూరు మండల పరిషత్ కార్యాలయం ప్రస్తుతం పిచ్చి మొక్కలు, మోకాలి ఎత్తు గడ్డితో దర్శనమిస్తోంది. కార్యాలయం చుట్టూ, ఆవరణలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పారిశుద్ధ్య పరిస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    వర్షాకాలం కావడంతో గడ్డి, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినా వాటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వివిధ పనుల కోసం గ్రామాల నుంచి వచ్చే రైతులు, మహిళలు పిచ్చి మొక్కల మధ్య నుంచే కార్యాలయంలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
    పాములు, తేళ్ల భయం
    కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు దట్టంగా పెరగడంతో పాములు, తేళ్లు, ఇతర విషజీవులు సంచరించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు కూడా విపరీతంగా పెరిగాయని, పారిశుద్ధ్య లోపంతో కార్యాలయ పరిసరాలు అసౌకర్యంగా మారాయని వాపోతున్నారు.
    ఎంపీడీవో కార్యాలయమే ఇలా ఉంటే.. గ్రామాల పరిస్థితి ఏంటి?
    మండల పరిపాలనకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఎంపీడీవో కార్యాలయ పరిసరాలే పరిశుభ్రంగా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం స్వచ్ఛత, పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
    వెంటనే శుభ్రం చేయాలి
    ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని వెంటనే తొలగించి, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని మండల ప్రజలు కోరుతున్నారు. పాములు, విషజీవుల సంచారం వల్ల ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.