EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే ఆలోచన మానుకోవాలి: విద్యార్థి సంఘాలు డిమాండ్

    Author P శివశంకర్ | 20 Aug 2026, 05:47 PM | TELANGANA
    సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే ఆలోచన మానుకోవాలి: విద్యార్థి సంఘాలు డిమాండ్

    యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి

    జీవో నం.97ను రద్దు చేసి.. శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

    నేషనల్ హైవేపై ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ భారీ ధర్నా
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: సాంకేతిక విద్యాశాఖను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేర్యాలలో భారీ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం చేర్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి–365బీపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
    ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

    జీవో నం.97ను రద్దు చేయాలి
    పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ప్రభావితం చేసే జీవో నం.97ను రద్దు చేయడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని కోరారు. సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
    ప్రభుత్వ నిర్ణయాల వల్ల డిప్లొమా విద్యార్థులు ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఉన్నత విద్యలోకి వెళ్లే అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా విద్యార్థులు తక్కువ వేతనాలకే ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

    లాటరల్ ఎంట్రీ కొనసాగించాలి
    డిప్లొమా విద్యార్థులకు ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉన్న లాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. 1957 నుంచి ఎంతోమంది సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లెనిన్ రాజ్, హరీష్, అక్రమ్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే యాసిన్, గిరిక అభినవ్తో పాటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే ఆలోచన మానుకోవాలి: విద్యార్థి సంఘాలు డిమాండ్ - Additional Image