EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హమ్మయ్య..! ఈ రోడ్డు కూడా ఎన్‌హెచ్‌–365బీదే..!

    Author THADEM PRASHANTH | 18 Aug 2026, 09:13 PM | TELANGANA
    హమ్మయ్య..! ఈ రోడ్డు కూడా ఎన్‌హెచ్‌–365బీదే..!

    బచ్చన్నపేట ప్రజల పోరాటాలు.. పత్రిక కథనాల ఎఫెక్ట్
    ఎట్టకేలకు ప్రారంభమైన రోడ్డు పనులు.. 2 కి.మీ. నరకయాతనకు తెర!

    ​బచ్చన్నపేట (హిందుస్థాన్ మీడియా):
    “హమ్మయ్య..! ఈ రోడ్డు కూడా ఎన్‌హెచ్‌–365బీదే అన్నమాట..!” అంటూ బచ్చన్నపేట ప్రజలు, నిత్య ప్రయాణికులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా నరకప్రాయంగా మారిన బచ్చన్నపేట పరిధిలోని కీలక రహదారి పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్థానిక ప్రజల నిరసనలు, ప్రజా సంఘాల పోరాటాలు, పత్రికల్లో వచ్చిన వరుస కథనాల ప్రభావంతో కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు పనులను ప్రారంభించారు.
    ​50 కి.మీ. ప్రయాణం ఒకెత్తు.. ఈ 2 కి.మీ. మరో ఎత్తు >!సిద్దిపేట నుంచి జనగామ వరకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం ఒక ఎత్తయితే, బచ్చన్నపేట పరిధిలోని కొడవటూరు కమాన్ వద్ద గల ఈ రెండు కిలోమీటర్ల మేర ప్రయాణం మరో ఎత్తుగా మారింది. 50 కిలోమీటర్లు ప్రయాణించినా రాని అలసట, ఒళ్లు నొప్పులు ఈ చిన్నపాటి గుంతల రోడ్డులోనే వచ్చేవని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. రాళ్లు తేలి, భారీ గోతులతో అధ్వానంగా మారిన ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు పొంచి ఉండేవి.
    ​తొలగిన సందిగ్ధత.. కదిలిన యంత్రాలు
    ఇన్నాళ్లూ ఈ రెండు కిలోమీటర్ల పరిధి అసలు ఎన్‌హెచ్‌–365బీ కిందకు వస్తుందో రాదోనన్న అనుమానాలు రేకెత్తించి, కాంట్రాక్టర్ ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేశారు. అధికారిక ప్రాజెక్టు వివరాల ప్రకారం జంగాం–దుద్దెడ సెక్షన్‌లో బచ్చన్నపేట గ్రామ పరిధిలోని 15.200 నుంచి 17.500 కిలోమీటర్ల మధ్య బైపాస్డ్ స్ట్రెచ్ అభివృద్ధికి (వన్‌టైమ్ ఇంప్రూవ్‌మెంట్) టెండర్ ప్రక్రియ జరిగినప్పటికీ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. తాజాగా భారీ యంత్రాలతో రోడ్డు పనులు మొదలుపెట్టడంతో ఈ మార్గం కూడా 365బీ అభివృద్ధి పనుల్లో భాగమేనన్న స్పష్టత వచ్చింది.
    ​ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
    కేవలం రెండు కిలోమీటర్ల రోడ్డు కోసం ప్రజలు ఏళ్ల తరబడి నరకం అనుభవించాల్సి రావడం ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వానికి పరాకాష్ట అని స్థానికులు విమర్శిస్తున్నారు. సమస్య తీవ్రత తెలిసినా ఇంతకాలం పరిష్కరించకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
    ​నాణ్యతతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
    ప్రస్తుతం రోడ్డు పనులు ప్రారంభమైన నేపథ్యంలో నేషనల్ హైవే అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి వాహనదారులకు శాశ్వత ఉపశమనం కలిగించాలని బచ్చన్నపేట ప్రజలు కోరుతున్నారు.
    ​— హిందుస్థాన్ మీడియా, నసీరుద్దీన్ బచ్చన్నపేట బ్యూరో