EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పిండిలో పురుగులు... కుళ్ళిన కూరగాయలు, పండ్లు.. ఇది మద్దూరు కేజీబీవీ పరిస్థితి: ఎస్ఎఫ్ఐ,సిపిఎం ఆరోపణ

    Author R K SRINIVAS | 17 Aug 2026, 07:42 PM | TELANGANA
    పిండిలో పురుగులు... కుళ్ళిన కూరగాయలు, పండ్లు.. ఇది మద్దూరు కేజీబీవీ పరిస్థితి: ఎస్ఎఫ్ఐ,సిపిఎం ఆరోపణ

    కేజీబీవీ ఫుడ్ పాయిజన్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
    అధికారుల నిర్లక్ష్యమే విద్యార్థినుల అస్వస్థతకు కారణం: ఎస్ఎఫ్‌ఐ, సీపీఎం

    రెండు రోజుల్లో తాత్కాలిక పరిష్కారం.. రెండు నెలల్లో శాశ్వత పరిష్కారం: అధికారులు
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 17: మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్‌ఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కేజీబీవీని సందర్శించిన అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
    ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా, పాఠశాలలోని గోధుమ, శనగపిండి, రవ్వలో పురుగులు, పల్లీల్లో పురుగులు, కుళ్లిపోయిన అరటిపండ్లు, కూరగాయలు ఉన్నాయని ఆరోపించారు. అలాగే నాణ్యత లేని ఆహారం, నీళ్ల చారు, సరిగా ఉడకని ఆలుగడ్డ కూర వంటి ఆహారాన్ని విద్యార్థులకు అందించారని పేర్కొన్నారు.
    ఆదివారం రోజు కూడా నాణ్యత లేని చికెన్ అందించారని ఆరోపించారు. నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
    డ్రైనేజీ సమస్యపై ఆగ్రహం
    కేజీబీవీ భవనం నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో మురుగునీరు పాఠశాల పరిసరాల్లోకి చేరుతోందని తెలిపారు. దీంతో పాఠశాల మొత్తం దుర్వాసన వెదజల్లుతోందని పేర్కొన్నారు.
    ఈ సమస్యలను పలుమార్లు మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    అధికారుల హామీతో ధర్నా విరమణ
    ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్‌ఐ ఘటనాస్థలికి చేరుకుని నాయకులతో, విద్యార్థులతో మాట్లాడారు. సమస్యకు రెండు రోజుల్లో తాత్కాలిక పరిష్కారం, రెండు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
    ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎండీ షఫీ, నాయకులు కనకయ్య, ఎస్ఎఫ్‌ఐ జిల్లా నాయకులు తాడూరి భరత్, మండల బాధ్యులు అల్ద హరీష్, నాయకులు ప్రశాంత్, కిషన్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.