EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దుబ్బాక సీరియల్ హత్యల గుట్టు రట్టు,మిస్టరీని ఛేదించిన సిద్దిపేట పోలీసులు

    Author THADEM PRASHANTH | 16 Aug 2026, 07:31 PM |
    దుబ్బాక సీరియల్ హత్యల గుట్టు రట్టు,మిస్టరీని ఛేదించిన సిద్దిపేట పోలీసులు

    బంగారం కోసం తల్లి–కొడుకు కలిసి హత్యలు.. నిందితురాలు అరెస్ట్, బాలుడు జువైనల్ హోమ్‌కు
    కేసును ఛేదించిన సిద్దిపేట పోలీసులను అభినందించిన సీపీ రష్మీ పెరుమాళ్

    హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో ఇటీవల కలకలం రేపిన పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం కేసు మిస్టరీని సిద్దిపేట పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో మృతురాలు భూంపల్లి గ్రామానికి చెందిన *అతికం విజయ (45)*గా గుర్తించారు. డబ్బు, బంగారం కోసం ఆమెను అదే గ్రామానికి చెందిన చాకలి రజిత (38), ఒక బాలుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
    ఈ కేసులో నిందితురాలు రజితను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ తెలిపారు.
    సీసీ కెమెరాల ఆధారంగా ఛేదింపు
    ఆగస్టు 8న రామక్కపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన పాక్షికంగా కాలిపోయిన గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు అందిన ఫిర్యాదుతో దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ తదితర ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
    చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు ఇతర ఆధారాలను సేకరించగా మృతురాలి వివరాలు, హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
    ఇంటికి సమీపంలోని కిరాణా దుకాణానికి పిలిచి..
    పోలీసుల కథనం ప్రకారం.. డబ్బు, బంగారం సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో రజిత, బాలుడు కలిసి విజయను ఇంటికి సమీపంలోని కిరాణా దుకాణానికి పిలిపించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై రామక్కపేట శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
    గతంలో మరో మహిళ హత్య
    దర్యాప్తులో ఇదే తల్లి–కొడుకు గతంలో మే 28, 2026న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివసించే కుంట రేఖను కూడా హత్య చేసి అచ్చుమాయిపల్లి గ్రామ అడవిలో మృతదేహాన్ని కాల్చివేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
    అదేవిధంగా జూన్ 2025లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు ఐదు తులాల పుస్తెలతాడును దోచుకున్న ఘటనలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
    రూ.10 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
    పోలీసులు నిందితుల నుంచి 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, రూ.1.03 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, బ్లూ కలర్ టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
    మరో నలుగురు టార్గెట్లా?
    దర్యాప్తులో నిందితులు టీ పాయింట్లు తదితర ప్రాంతాల్లో ప్రజల కదలికలను గమనిస్తూ, ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు, ఆస్తి వివాదాలు లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే జరిగిన నేరాలతో పాటు మరో నలుగురిని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.
    పోలీసు బృందాలకు సీపీ అభినందనలు
    కేవలం వారం రోజుల వ్యవధిలోనే కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి పట్టుకున్న పోలీసు అధికారులను సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు. ఈ కేసుతో పాటు గతంలో జరిగిన మరో హత్య, దోపిడీ కేసులను ఛేదించిన సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుబ్బాక సీఐ రాజేష్, ఎస్‌ఐ కీర్తిరాజు, భూంపల్లి ఎస్‌ఐ రాజశేఖర్, మీరుదొడ్డి ఎస్‌ఐ సతీష్, ఎస్‌ఐ సైఫ్ అలీ, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ప్రశంసించారు.
    ప్రజలకు పోలీసుల సూచనలు
    నిర్జన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని పోలీసులు సూచించారు. ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద బ్యాకప్‌తో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
    ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంతో గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘా మరింత బలోపేతమైందని, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడుతున్నాయని సీపీ పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

    దుబ్బాక సీరియల్ హత్యల గుట్టు రట్టు,మిస్టరీని ఛేదించిన సిద్దిపేట పోలీసులు - Additional Image