EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర....చేర్యాలలో భారీ బైక్ ర్యాలీ

    Author P శివశంకర్ | 11 Aug 2026, 07:53 PM | TELANGANA
    అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర....చేర్యాలలో భారీ బైక్ ర్యాలీ

    ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుంచి 18 వరకు ‘అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర’ నిర్వహిస్తున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు.
    చైతన్య బస్సు యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోటలో ప్రారంభమైన యాత్ర, చేర్యాల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మంది కల్లుగీత కార్మికులతో కలిసి జాతీయ రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు.
    ఇచ్చిన హామీలనే అమలు చేయాలి
    కల్లుగీత కార్మికులకు పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని, ఎక్సిగ్రేషియా రూ.10 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని ఎం.వి. రమణ తెలిపారు. అధికారంలోకి వచ్చి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
    వృత్తిలో ప్రమాదాలకు గురైన గీత కార్మికులకు చెల్లించాల్సిన సుమారు రూ.20 కోట్ల ఎక్సిగ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పెన్షన్ అందించే జీవో ఉన్నప్పటికీ కొత్త దరఖాస్తులు స్వీకరించకపోవడం సరికాదన్నారు.
    “కొత్తగా ఏమీ కోరడం లేదు.. మీరే ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం” అని నాయకులు స్పష్టం చేశారు.
    ప్రతి గీత కార్మికుడికి రక్షణ కవచం ఇవ్వాలి
    వృత్తిలో ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కవచాన్ని అర్హులైన గీత కార్మికులందరికీ అందించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 2.30 లక్షల మంది సభ్యులు ఉండగా, కేవలం 30 వేల మందికే రక్షణ కవచాలు అందించారని నాయకులు తెలిపారు.
    తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించాలని, నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. నందనంలోని నీరా ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, బడ్జెట్‌లో నీరాకు కేటాయించిన రూ.25 కోట్లు, సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లను వెంటనే విడుదల చేసి ఖర్చు చేయాలని కోరారు.
    గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఈ చైతన్య యాత్ర చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఆగస్టు 18లోగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    ఈ కార్యక్రమంలో యాత్ర బృందం సభ్యులు బూడిద గోపి, బాల్నే వెంకట మల్లయ్య, గౌని వెంకన్న, భీమగోని చంద్రయ్య, పామనుగుళ్ల అచ్చాలు, కొండం కరుణాకర్, కుర్ర ఉప్పలయ్య, బండకింది బాల్ నారాయణ, మొక్క నాగేశ్వరరావు, బుర్ర సుధాకర్, పాలకూరి జగన్, సురుగు రాజేష్ గౌడ్, 7వ వార్డు కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, సొసైటీ అధ్యక్షులు, కల్లుగీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

    అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర....చేర్యాలలో భారీ బైక్ ర్యాలీ - Additional Image