EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి :మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

    Author THADEM PRASHANTH | 10 Aug 2026, 07:02 PM | TELANGANA
    తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి :మాజీ మంత్రి  హరీష్ రావు డిమాండ్

    రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా నీటి పంపింగ్ ప్రారంభించాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు
    హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు, ఆగస్టు 10: వానాకాలం సాగు కోసం రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
    రాష్ట్రంలోని రైతుల సాగు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుని వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించాలని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు తక్కువ వర్షపాతం, మరోవైపు రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

    4 లక్షల ఎకరాలకు నీరందించాలి
    కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, అంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, నృసింహ బస్వాపూర్ తదితర రిజర్వాయర్లను నింపి వాటి పరిధిలోని ఆయకట్టుకు నీరందించాలని కోరారు. వీటి ద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
    ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద నీటి లభ్యత ఏర్పడే అవకాశం ఉన్నందున, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి సకాలంలో పంపింగ్ చేయాలని సూచించారు.
    మిడ్‌మానేరు నుంచి నీటి పంపింగ్ చేయాలి
    కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్‌మానేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మిడ్‌మానేరు నుంచి మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి ఎగువ రిజర్వాయర్లను నింపాలని కోరారు.
    అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 6.9 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు. మిడ్‌మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీటిని తరలించి, సంబంధిత ఆయకట్టుకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.
    గత యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఎగువ రిజర్వాయర్ల ఆయకట్టులో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత వానాకాలంతో పాటు వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందేలా రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లను నీటితో నింపాలని కోరారు.రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ ప్రారంభించాలని హరీశ్‌రావు తన లేఖలో డిమాండ్ చేశారు.