EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేశ సంపదను కొల్లగొడుతున్న విధానాలను రద్దు చేయాలి

    Author THADEM PRASHANTH | 10 Aug 2026, 02:12 PM | Array
    దేశ సంపదను కొల్లగొడుతున్న విధానాలను రద్దు చేయాలి

    క్విట్‌ కార్పొరేట్‌ నినాదంతో చేర్యాలలో రాస్తారోకో.. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల, ఆగస్టు 10: దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రైవేటీకరణ విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో డిమాండ్ చేశారు.
    క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘క్విట్ కార్పొరేట్’ నినాదంతో సోమవారం చేర్యాల పాత బస్టాండ్ కూడలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కొంగరి వెంకట్ మావో మాట్లాడుతూ, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాలు మోపుతోందని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

    లేబర్ కోడ్లు రద్దు చేయాలి
    కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. హమాలీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీలు, మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా, ఐకేపీ, వైద్యరంగం, ఉపాధి హామీ తదితర రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

    రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
    రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, విదేశీ పంటల దిగుమతులకు కారణమయ్యే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. రైతులకు ఎరువులు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎరువుల కొనుగోలులో ఇబ్బందులు కలిగించే విధానాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
    2025 నూతన విద్యుత్ బిల్లును రద్దు చేసి స్మార్ట్ మీటర్ల విధానాన్ని తొలగించాలని, రైతులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరారు.
    ఉపాధి హామీని బలోపేతం చేయాలి
    ఉపాధి హామీ పథకానికి కేంద్రం తగ్గించిన నిధులను పెంచాలని, ఉపాధి కూలీలకు ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ.800 కూలి కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలకు ఇబ్బందులు కలిగించే ఫొటో క్యాప్చరింగ్ విధానాన్ని తొలగించాలని కోరారు.
    దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడాలని, ప్రైవేటీకరణ విధానాలు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలతో ఐక్యంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్.డి. ఇబ్రహీం, బండకింది అరుణ్‌కుమార్, ఆముదాల నర్సిరెడ్డి, పోలోజు శ్రీహరి, బోయిని మల్లేశం, ముస్త్యాల ప్రభాకర్, నంగి మైసయ్య, ఆముదాల రంజిత్‌రెడ్డి, తుప్పతి రాజు, మాచర్ల విష్ణుమూర్తి, ఎర్రబోస్ అశోక్, మోకు దేవేందర్‌రెడ్డి, నాగపురి కనకయ్య, జిడాల చంద్రయ్య, దాసరి కనకయ్య, రేపాక కుమార్, గుండ్ర రవీందర్, పాల వెంకటేశం, పడిదం వీరమణి, సౌభాగ్య, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి, రజిత, సుశీల తదితరులు పాల్గొన్నారు.

    దేశ సంపదను కొల్లగొడుతున్న విధానాలను రద్దు చేయాలి  - Additional Image