EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం

    Author THADEM PRASHANTH | 09 Aug 2026, 10:43 AM | TELANGANA
    కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం

    ఆగస్టు 10 జైల్‌భరోను జయప్రదం చేయాలి

    క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతులు, కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలి: బానోతు సంతోష్ నాయక్
    హిందుస్థాన్ మీడియా: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్‌భరో కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బానోతు సంతోష్ నాయక్ పిలుపునిచ్చారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తుండటంతో దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
    రైతులు పండించిన పంటలకు సీ2+50 శాతం ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీతో పాటు ప్రభుత్వ కొనుగోలు భరోసా కల్పించాలని కోరారు. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు వ్యవసాయ కూలీలకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
    కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
    నాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో, నేడు వ్యవసాయ రంగం నుంచి కార్పొరేట్ సంస్థలను తొలగించేందుకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సంతోష్ నాయక్ అన్నారు.
    కేంద్ర ప్రభుత్వం తన రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే రైల్‌రోకో, రాస్తారోకో వంటి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    ఆగస్టు 10న జరిగే జైల్‌భరో కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.