EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *​ప్రతి పాఠశాలలో ఫీజుల బోర్డు,స్టాఫ్ అర్హతల వివరాలు ప్రజలకు కనిపించాలి!

    Author THADEM PRASHANTH | 08 Aug 2026, 08:36 AM | TELANGANA
    *​ప్రతి పాఠశాలలో ఫీజుల బోర్డు,స్టాఫ్ అర్హతల వివరాలు ప్రజలకు కనిపించాలి!

    *​విద్య వ్యాపారంగా మారకూడదంటే బడుల్లో పారదర్శకత అత్యవసరం

    *​తగిన అర్హతలు లేని ఉపాధ్యాయుల నియామకాలు, విచ్చలవిడి ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడాలి
    ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    ​అక్షరాస్యతను పెంపొందించాల్సిన విద్యను సేవగా కాకుండా లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా మార్చుతున్న కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల తీరుపై పారదర్శకత తీసుకురావాలంటే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద తరగతుల వారీ ఫీజుల వివరాల బోర్డుతో పాటు బోధిస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు, అనుభవం మరియు నియామక వివరాలు ప్రదర్శించే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడాన్ని విద్యాశాఖ తప్పనిసరి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.
    *

    ​ఒకే తరగతి.. వేర్వేరు ఫీజుల అక్రమాలు*
    ​ప్రస్తుతం చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే తరగతి చదువుతున్న వేర్వేరు విద్యార్థుల నుంచి వారి స్తోమతను బట్టి వేర్వేరు ఫీజులు వసూలు చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు పాఠశాల యాజమాన్యాలు లాభాల బాటలో పడి తగిన విద్యా, ప్రొఫెషనల్ అర్హతలు (డీఈడ్/బీఈడ్) లేని వ్యక్తులను తక్కువ జీతాలకు ఉపాధ్యాయులుగా నియమిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ అక్రమాలకు, దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి పాఠశాలలో స్పష్టమైన ఫీజు బోర్డు, స్టాఫ్ క్వాలిఫికేషన్ బోర్డు ఉండేలా విద్యాశాఖ తక్షణమే కఠిన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.

    *​బడి బోర్డుపై తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు:*
    *​ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతికి సంబంధించి సేకరించే ఫీజుల వివరాలు.
    *​అడ్మిషన్, ట్యూషన్, ట్రాన్స్‌పోర్ట్, పుస్తకాలు, యూనిఫాం తదితర ఇతర ఛార్జీల పూర్తి సమాచారం.
    *​ప్రతి ఉపాధ్యాయుడి పేరు, విద్యా అర్హత మరియు బీఈడ్ / డీఈడ్ వంటి ప్రొఫెషనల్ అర్హతల వివరాలు.
    *​బోధనా సిబ్బందికి ఉన్న అనుభవం, బోధించే సబ్జెక్టుల స్పష్టమైన వివరాలు.
    *​సదరు పాఠశాల ప్రభుత్వ గుర్తింపు (Recognition), జీవో వివరాలు మరియు అనుమతుల సమాచారం.
    *

    ​విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి*
    ​విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ప్రవేశ ద్వారాల వద్ద ఈ పారదర్శక బోర్డులను ఏర్పాటు చేయని పాఠశాల యాజమాన్యాలకు వెంటనే నోటీసులు జారీ చేయాలి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసే యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైతే సదరు పాఠశాలల గుర్తింపును రద్దు చేసే వరకు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
    ​"ఫీజుల్లో పారదర్శకత – విద్యలో నాణ్యత" అనే స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ వెంటనే రంగంలోకి దిగి మార్గదర్శకాలు జారీ చేయాలని, స్కూల్ ఫీజులకు సంబంధించిన వివరాలను తెలపాలని అన్ని జిల్లాల DEO లకు ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది... అలాగే ఉపాధ్యాయుల విద్యార్హతలు బోర్డులను కూడా తప్పనిసరి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰