EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈ దారి... నరకదారి..!.. అయ్యా..కాంట్రాక్టర్.. ఈ 2 కిలోమీటర్లు NH-365బి కాదా..??

    Author THADEM PRASHANTH | 06 Aug 2026, 05:02 PM | TELANGANA
    ఈ దారి... నరకదారి..!.. అయ్యా..కాంట్రాక్టర్.. ఈ 2 కిలోమీటర్లు NH-365బి కాదా..??

    కొడవటూరు కమాన్ నుంచి బచ్చన్నపేట వరకు గుంతల మయమైన జాతీయ రహదారి

    కోట్ల రూపాయల కాంట్రాక్ట్.. ప్రయాణికులకు మాత్రం తప్పని నిత్య నరకయాతన

    తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్
    ​బచ్చన్నపేట (హిందుస్థాన్ మీడియా):
    ​జనగామ – బచ్చన్నపేట మీదుగా సాగుతున్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్-365బీ) నిర్మాణ పనుల్లో తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది. జనగామ నుంచి దుద్దెడ క్రాస్ రోడ్డు వరకు రహదారి పనులు పూర్తిస్థాయిలో పూర్తయినప్పటికీ (అక్కడక్కడ మినహా ), కొడవటూరు కమాన్ నుంచి బచ్చన్నపేట వరకు ఉన్న సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారిని మాత్రం కాంట్రాక్టర్ పూర్తిగా వదిలేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు నిత్యం నరకయాతన ఎదురవుతోంది.
    ​ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
    ​ప్రతిరోజూ ఈ జాతీయ రహదారి గుండా వందలాది ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు, ఆటోలు మరియు ఆర్టీసీ బస్సులు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రాకాసి గుంతల కారణంగా వాహనదారులు వాహనాలను నడపలేక నానా అవస్థలు పడుతున్నారు. దుద్దెడ నుంచి జనగామ వరకు ప్రయాణం ఒక ఎత్తయితే... కొడవటూరు కమాన్ నుంచి బచ్చన్నపేట వరకు ఉన్న ఈ రెండు కిలోమీటర్ల ప్రయాణం అంతకన్నా పెద్ద పరీక్షగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో వాహనాలను జిగ్‌జాగ్‌గా నడపాల్సి వస్తోందని, ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిత్యం భయం భయంగా ప్రయాణిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    *​కోట్ల రూపాయల కాంట్రాక్ట్ – రెండు కిలోమీటర్లు ఎందుకు వదిలేశారు?*
    ​కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న జాతీయ రహదారి పనుల్లో ఈ రెండు కిలోమీటర్ల రోడ్డును ఎందుకు విస్మరించారనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవేళ భవిష్యత్తులో బచ్చన్నపేట బైపాస్ నిర్మించే ఆలోచన ఉన్నప్పటికీ, అప్పటి వరకు ఈ రహదారిపై ఉన్న ప్రమాదకర గుంతలను కనీసం తార్‌తో పూడ్చి ప్రయాణానికి అనువుగా చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌పై ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇంత దయనీయ పరిస్థితి నెలకొన్నా నేషనల్ హైవే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    *​ప్రజాప్రతినిధులు, అధికారులకు స్థానికుల స్పష్టమైన డిమాండ్లు:*
    ​కొడవటూరు కమాన్ – బచ్చన్నపేట మధ్య ఉన్న రోడ్డు గుంతలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయాలి.
    ​ఎన్‌హెచ్-365బీ పెండింగ్ పనులను తక్షణమే వేగవంతం చేసి పూర్తి చేయాలి.
    ​ప్రజా ధనాన్ని వృథా చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
    ​భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించకముందే అధికారులు క్షేత్రస్థాయిలో స్పందించాలి.
    ​ఇకనైనా జాతీయ రహదారుల అధికారులు నిద్రమత్తు వీడి, తక్షణమే స్పందించి ఈ రెండు కిలోమీటర్ల మార్గానికి విముక్తి కలిగించాలని బచ్చన్నపేట, కొడవటూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰

    ఈ దారి... నరకదారి..!.. అయ్యా..కాంట్రాక్టర్.. ఈ 2 కిలోమీటర్లు NH-365బి కాదా..?? - Additional Image