EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఊరు మెచ్చిన ఉపాధ్యాయుడు దేవరాజ్

    Author THADEM PRASHANTH | 04 Aug 2026, 07:47 PM | TELANGANA
    ఊరు మెచ్చిన ఉపాధ్యాయుడు దేవరాజ్

    భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న దేవరాజ్

    పుస్తక విద్యకే కాదు.. జీవన నైపుణ్యాలకు పెద్దపీట

    సేంద్రీయ వ్యవసాయం నుంచి సైన్స్ ప్రాజెక్టుల వరకు వినూత్న బోధన..

    ప్రభుత్వ బడికి పెరిగిన ఆదరణ
    హిందుస్థాన్ మీడియా, నారాయణరావుపేట:
    ఒక మంచి ఉపాధ్యాయుడు తలచుకుంటే ప్రభుత్వ పాఠశాల రూపురేఖలనే మార్చగలడని నిరూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని నాంచారుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చేగూరి దేవరాజ్. పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఆచరణాత్మక విద్య, జీవిత విలువలు, శాస్త్రీయ దృక్పథం, వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందుతున్నారు.
    74 నుంచి 140 మందికి పెరిగిన విద్యార్థుల సంఖ్య
    2018లో ఈ పాఠశాలలో విధుల్లో చేరిన దేవరాజ్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో నమ్మకం పెంచారు. ఒకప్పుడు 74 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 140కు చేరడం ఆయన కృషికి నిదర్శనం. గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదవడం విశేషం.
    పంట పొలాలే తరగతి గదులు
    విద్యార్థులు ప్రకృతిని, వ్యవసాయాన్ని దగ్గరగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారిని నేరుగా పంట పొలాలకు తీసుకెళ్లి సేంద్రీయ

    వ్యవసాయంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే నష్టాలు, సేంద్రియ సాగు ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూపిస్తూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుతున్నారు.

    క్షేత్రస్థాయి ప్రదర్శనలతో వినూత్న బోధన
    సిలబస్ బోధనకే పరిమితం కాకుండా, పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా బోధిస్తూ విద్యార్థుల్లో పరిశీలన, ఆలోచనా శక్తి, సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. దీంతో పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరిగి, అభ్యాసన సులభంగా మారుతోంది.
    దాతల సహకారంతో మెరుగైన వసతులు
    పాఠశాల అభివృద్ధికి స్థానిక దాతలను భాగస్వాములను చేస్తూ తరగతి గదుల అభివృద్ధి, తాగునీటి సదుపాయం, డిజిటల్ లెర్నింగ్ పరికరాలు, విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ, ఇతర మౌలిక వసతులను సమకూర్చడంలో దేవరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
    రాష్ట్రస్థాయికి ఎంపికైన సైన్స్ ప్రాజెక్ట్
    విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన దేవరాజ్ సైన్స్ ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ విజయం విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ప్రేరణగా మారింది.
    పురస్కారాలతో గుర్తింపు
    ఉపాధ్యాయుడిగా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ కే. హేమావతి, భువనగిరి ఎంపీ రఘునందన్ రావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ అధికారులు తదితరుల చేతుల మీదుగా పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.
    ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు చేగూరి దేవరాజ్ నేటి ఉపాధ్యాయ సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా మారుతున్నారు.

    ఊరు మెచ్చిన ఉపాధ్యాయుడు దేవరాజ్  - Additional Imageఊరు మెచ్చిన ఉపాధ్యాయుడు దేవరాజ్  - Additional Imageఊరు మెచ్చిన ఉపాధ్యాయుడు దేవరాజ్  - Additional Image