EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ వైపు బారికేడ్... మరోవైపు ఫ్లెక్సీ..! భద్రతా ప్రయాణం ఎలా..? చేర్యాలలో అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం

    Author THADEM PRASHANTH | 22 Jul 2026, 06:44 PM | TELANGANA
     ఓ వైపు బారికేడ్... మరోవైపు ఫ్లెక్సీ..! భద్రతా ప్రయాణం ఎలా..? చేర్యాలలో అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం

    చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    చేర్యాల పట్టణంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, అదే ప్రాంతంలో రహదారిపైకి చొచ్చుకొచ్చేలా భారీ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
    పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ కారణంగా వాహనదారుల దృష్టి మరలడమే కాకుండా, రోడ్డు విస్తీర్ణం కూడా తగ్గిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బారికేడ్లతో రహదారి కుదించబడితే, మరోవైపు ఫ్లెక్సీలు కూడా రోడ్డు వైపుకు రావడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
    ఇప్పటికే కొన్ని రాజకీయ ప్రభావాల కారణంగా 100 అడుగుల వెడల్పు ఉండాల్సిన రహదారి 90 అడుగులకు కుదించబడిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అసంపూర్తిగా వదిలిన పనులు, సరైన భద్రతా చర్యల లోపం కారణంగా చేర్యాలలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
    మరోవైపు, పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా స్పందించి ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని, కొద్ది రోజులకే మళ్లీ యథాతథంగా వాటిని ఏర్పాటు చేయడం పరిపాటిగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది సమస్య పరిష్కారం కాదని, తాత్కాలిక చర్యలతో ప్రజల ప్రాణ భద్రతను విస్మరించరాదని వారు అంటున్నారు.
    ప్రజల ప్రాణాలు ముఖ్యమా... లేక రోడ్లపై అడ్డంగా నిలిచే ఫ్లెక్సీలే ముఖ్యమా? అనే ప్రశ్న ఇప్పుడు చేర్యాల వాసుల నుంచి వినిపిస్తోంది.
    "ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు... ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే పరిపాలనకు అసలైన పరీక్ష" అని స్థానికులు అధికారులకు సూచిస్తున్నారు.

     ఓ వైపు బారికేడ్... మరోవైపు ఫ్లెక్సీ..! భద్రతా ప్రయాణం ఎలా..? చేర్యాలలో అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం  - Additional Image