EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..ఖైరతాబాద్ స్థానం ఖాళీ!

    Author THADEM PRASHANTH | 24 Sep 2026, 09:17 PM | Politics, TELANGANA
    దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..ఖైరతాబాద్ స్థానం ఖాళీ!

    హైకోర్టు అనర్హత తీర్పులో జోక్యానికి నిరాకరణ..
    హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

    హైకోర్టు తీర్పుకే సుప్రీం మద్దతు
    భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం దానం నాగేందర్ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ హైకోర్టు చట్టాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తీర్పు ఇచ్చిందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

    పార్టీ మార్పుపైనే వివాదం
    2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండటంతో ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.
    తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గతంలో దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత అలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
    ఏప్రిల్ 23, 2024 నుంచే అనర్హత
    ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. ఆయన అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అదే సమయంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారిందని ప్రకటించింది.

    హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యానికి నిరాకరించడంతో ఆయన అనర్హతపై న్యాయపరమైన సవాలు విఫలమైనట్లయింది.
    ఖైరతాబాద్‌లో ఉపఎన్నికకు మార్గం
    ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు అక్కడ ఉపఎన్నిక నిర్వహణకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై దృష్టి నెలకొంది. అయితే ఉపఎన్నిక తేదీ, షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంటుంది.

    దానం నాగేందర్ స్పందన
    సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్ స్పందిస్తూ తీర్పును స్వాగతించారు. రానున్న ఉపఎన్నికలో ప్రజల మద్దతు తనకు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయాన్ని ప్రస్తుతం వెల్లడించలేదు. ఎన్నికల షెడ్యూల్, టికెట్ ప్రకటన తర్వాత రాజకీయ అంశాలపై మాట్లాడతానని ఆయన తెలిపారు.
    — హిందుస్థాన్ మీడియా | సామాన్యుడి నేస్తం