EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళీ భూ పోరాటాలు : బీవీ రాఘవులు

    Author P శివశంకర్ | 17 Sep 2026, 07:46 PM | TELANGANA
    తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళీ భూ పోరాటాలు : బీవీ రాఘవులు

    చేర్యాల నుంచి వీర బైరాన్‌పల్లికి భారీ బైక్‌ ర్యాలీ
    చేర్యాల, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో భూమిలేని పేదలను సమీకరించి భూ పోరాటాలు నిర్వహించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వీర బైరాన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వెళ్తూ చేర్యాల గాంధీ సెంటర్‌ నుంచి వీర బైరాన్‌పల్లి వరకు నిర్వహించిన భారీ బైక్‌ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడారు.
    తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేద ప్రజలను ఆత్మగౌరవంతో నిలబెట్టిన మహత్తర పోరాటమని ఆయన అన్నారు. దొరలు, భూస్వాములు, జాగీర్‌దార్లు, పటేల్‌, పట్వారీ వ్యవస్థల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని తెలిపారు. ఈ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నేటి పరిస్థితుల్లో భూమిలేని పేదల హక్కుల కోసం భూ పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
    భూమి హక్కుల కోసం సాగిన పోరాటం
    1946 సెప్టెంబర్‌ నుంచి 1951 అక్టోబర్‌ వరకు తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిందని రాఘవులు తెలిపారు. నైజాం రాచరిక వ్యవస్థకు ముగింపు పలకడం, దున్నేవానికి భూమి ఇవ్వడం, రైతాంగానికి భూమి హక్కులు కల్పించడం, వెట్టిచాకిరీని రద్దు చేయడం, మాతృభాషలో విద్యాబోధన వంటి డిమాండ్లతో పోరాటం సాగిందన్నారు.
    ఈ పోరాటంలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, పోరాట ఫలితంగా లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయబడిందని, అనేక గ్రామాల్లో ప్రజా పాలన ఏర్పడిందని రాఘవులు పేర్కొన్నారు. భూమిశిస్తులు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కూడా పోరాటం జరిగిందన్నారు.
    ఇది మత పోరాటం కాదు: బీవీ రాఘవులు
    తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మతపరమైన కోణంలో చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాఘవులు విమర్శించారు. తన అభిప్రాయం ప్రకారం ఇది మతాల మధ్య జరిగిన పోరాటం కాదని, భూస్వామ్య దోపిడీ, రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాగిన వర్గ పోరాటమని అన్నారు.
    ఈ పోరాటంలో వివిధ మతాలకు చెందిన ప్రజలు, నాయకులు పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. భూమి కోసం పోరాడిన బందగీ, నిజాం వ్యతిరేకంగా రచనలు చేసిన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్‌, కమ్యూనిస్టు నాయకుడు మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ వంటి ముస్లిం నాయకుల పాత్రను ఆయన ప్రస్తావించారు. మరోవైపు పలువురు హిందూ భూస్వాములకు వ్యతిరేకంగానూ రైతులు పోరాడారని తెలిపారు. అందువల్ల ఈ పోరాటాన్ని మతపరమైన ఘర్షణగా కాకుండా నాటి సామాజిక, భూ సంబంధిత పరిస్థితుల నేపథ్యంలో చూడాలని ఆయన అన్నారు.
    తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాఘవులు ఆరోపించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలను సీపీఎం వైఖరిగా పేర్కొన్నారు. భూమిలేని పేదలందరినీ సమీకరించి భూ హక్కుల కోసం రాబోయే కాలంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.
    అనంతరం చేర్యాల గాంధీ సెంటర్‌ నుంచి భారీ బైక్‌ ర్యాలీగా సీపీఎం నాయకులు, కార్యకర్తలు వీర బైరాన్‌పల్లికి బయలుదేరారు.
    ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు, జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాలస్వామి, శెట్టిపల్లి సత్తిరెడ్డి, రాళ్లబండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, గొడ్డుబర్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో, బద్దిపడిగే కృష్ణారెడ్డి, అత్తినీ శారద, సింగిరెడ్డి నవీన్, జాలిగపు శిరీష, చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్, కొమురవెల్లి మండల కార్యదర్శి తాడూరు రవీందర్, చుంచనకోట సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, కోఆప్షన్‌ సభ్యుడు ఎస్‌డీ ఇబ్రహీం, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, దాసరి ప్రశాంత్, తిప్పరపు శ్రీనివాస్, అమ్ముల బాల్‌నర్సయ్య, ఇప్పకాయల శోభ, పొలోజు శ్రీహరి, బోయినీ మల్లేశ్, ఎర్రబోసు అశోక్, తుప్పతి రాజు, బత్తుల అభిషేక్, భాను, రంజిత్‌రెడ్డి, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.