EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కూరగాయల అంగడి... కుక్కల అడ్డా..|

    Author R K SRINIVAS | 10 Sep 2026, 08:43 PM | Array
    కూరగాయల అంగడి... కుక్కల అడ్డా..|

    కూరగాయలు, మాంసం దుకాణాల వద్ద వ్యాపారులు, కొనుగోలుదారులకు తీవ్ర ఇబ్బందులు
    ​మహిళలు, చిన్నారులపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయాందోళనలు
    ​వ్యర్థాల తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వీధికుక్కల నియంత్రణకు పంచాయతీ చర్యలు చేపట్టాలని డిమాండ్

    ​మద్దూరు (హిందుస్థాన్ మీడియా):
    ​వారం సంతలో వీధికుక్కల బెడద
    ​సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే కూరగాయల అంగడిలో వీధికుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. వారపు సంత జరిగే ప్రదేశంలో శునకాలు గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తుండటంతో అటు చిరు వ్యాపారులు, ఇటు సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర భయాందోళనలు ఎదుర్కొంటున్నారు. అంగడి ప్రాంగణంలోని కూరగాయల దుకాణాలు, మాంసం విక్రయించే ప్రాంతాల చుట్టూ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ఆహారం కోసం వెంటపడుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది.
    ​కొనుగోలుదారుల్లో వణుకు – వ్యాపారుల ఆందోళన
    ​వారం సంతకు సరుకుల కొనుగోలు కోసం వచ్చే మహిళలు, చిన్నారులు, వృద్ధులు వీధికుక్కల గుంపులను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతుల్లో ఉన్న సంచుల కోసం శునకాలు ఎక్కడ మీదపడతాయో, ఏ క్షణంలో దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ అంగడిలో తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కస్టమర్ల వెంట కుక్కలు పడుతుండటంతో వ్యాపారాలు సజావుగా సాగడం లేదని అంగడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    *పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలి
    ​ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వీధికుక్కల నియంత్రణపై గ్రామపంచాయతీ యంత్రాంగం తక్షణమే దృష్టి సారించాలని అంగడి వ్యాపారులు, స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంగడి ముగిసిన వెంటనే పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి బ్లీచింగ్ చల్లేలా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని, అలాగే వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల ప్రాణ భద్రతకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰

    కూరగాయల అంగడి... కుక్కల అడ్డా..| - Additional Image