EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీడీని, నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి:

    Author హిందుస్థాన్ మీడియా | 20 Jul 2026, 07:07 PM | TELANGANA
    విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీడీని, నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి:

    హిందుస్థాన్ మీడియా, బెజ్జంకి: బెజ్జంకి మోడల్ స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాసంస్థలు విద్యార్థులకు భద్రత, క్రమశిక్షణ, విలువలు నేర్పించే కేంద్రాలుగా ఉండాలని, అలాంటి చోటే విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై ప్రభుత్వం ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ప్రవర్తన, విద్యార్థుల భద్రత, పాఠశాలల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఇటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే స్పందించి బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
    24 గంటల్లో పీడీ, ప్రిన్సిపాల్‌లపై సస్పెన్షన్ చర్యలు తీసుకోకపోతే తల్లిదండ్రులతో కలిసి మోడల్ స్కూల్ ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తామని, అనంతరం కూడా స్పందించకపోతే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనను ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణ హెచ్చరించారు.