🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 10 Nov, 2026 | Page: 1

నాగపురి పాఠశాలలో అందెశ్రీ ప్రథమ వర్ధంతి

తెలంగాణ రాష్ట్ర గీత రచయితకు ఘన నివాళులు
పల్లె కవి.. ప్రజా కవి.. ప్రపంచ కవిగా ఎదిగిన అందెశ్రీ: ప్రధానోపాధ్యాయుడు ఐలయ్య
నాగపురి, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మండలం నాగపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎలికట్ట ఐలయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ, 2025 నవంబర్ 10న హైదరాబాద్‌లో కన్నుమూశారని తెలిపారు. పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి తన సాహిత్య ప్రతిభతో ప్రపంచ కవిగా ఎదగడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు.తెలంగాణ ఉద్యమానికి తన గేయాలతో ఊపిరి పోసిన అందెశ్రీ, రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’తో పాటు ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా’, ‘చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి’ వంటి ఎన్నో అద్భుతమైన గేయాలను రచించారని గుర్తుచేశారు. ఆయన రచించిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ గేయం పాఠ్యపుస్తకాల్లో చోటు సంపాదించడం గొప్ప విషయమన్నారు.అందెశ్రీ పల్లె కవి, ప్రకృతి కవి, ప్రజా కవి, సహజ కవి, ప్రపంచ కవిగా తనదైన ముద్ర వేశారని ఐలయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయితగా గుర్తింపు పొందిన అనంతరం ఆయనను నాగపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆహ్వానించడం, విద్యార్థులకు ఆయనను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.జనగణమన గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్, వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ రచయిత శంకరంబాడి సుందరాచారి, పాఠశాల ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వంటి మహనీయులను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయినా, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీని తమ పాఠశాలకు ఆహ్వానించే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.అందెశ్రీ గీతాలు అజరామరమని, భూమి, నీరు, గాలి, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన రచనలు ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాటల రూపంలో ప్రజలతోనే ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది ఎస్. కృష్ణమూర్తి, టి. పద్మ, ఎస్. నిరూపమ, అందె విజయకుమార్, టి. మనోజ్‌కుమార్, జి. ప్రకాష్‌రెడ్డి, కె. మాధవి, పి. రాజేశ్వరి, ఎస్. కనకలింగం, జి. శ్రీధర్, బి. ధనలక్ష్మి, ఎం.డి. ఉమర్, ఎస్. స్వామి, బి. మంజుల, ఆశా కార్యకర్తలు బి. కవిత, బి. కావ్యరాణి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home