🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 07 Nov, 2026 | Page: 1

బతికున్న వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు.. రాంపూర్ పంచాయతీ కార్యదర్శి, మరో వ్యక్తి పై కేసు నమోదు

​వ్యక్తిగత ఈ-సైన్ (E-sign) డాంగిల్ కీని ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టిన రాంపూర్ పంచాయతీ కార్యదర్శి భుక్య మధు
​హైదరాబాద్‌లోని ఇంటర్నెట్ సెంటర్ కేంద్రంగా ఏకంగా 22 నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ
​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
చేర్యాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామ పంచాయతీలో అధికారిక డిజిటల్ సంతకాన్ని (ఈ-సైన్) దుర్వినియోగం చేస్తూ, బతికి ఉన్న వ్యక్తుల పేరిట మరణ ధృవీకరణ పత్రాలు (డెత్ సర్టిఫికెట్లు) జారీ చేసిన భారీ మోసం తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేర్యాల మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
​వివరాల్లోకి వెళితే.. చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భుక్య మధు, ప్రభుత్వ విధి నిర్వహణలో అధికారిక ధృవీకరణ కోసం అత్యంత భద్రంగా తన వద్ద ఉంచుకోవాల్సిన వ్యక్తిగత ఈ-సైన్ (E-sign) డాంగిల్ కీని అదే గ్రామానికి చెందిన షేవల్ల రమేష్ అనే ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారు. హైదరాబాద్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న సదరు రమేష్, ఆ డాంగిల్ కీని ఉపయోగించి చట్టవిరుద్ధంగా నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించాడు. ఫిబ్రవరి 2026 నుండి సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో ఇంకా ప్రాణాలతో జీవించి ఉన్న వ్యక్తుల పేరిట ఏకంగా 22 మరణ ధృవీకరణ పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసినట్లు ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో బట్టబయలైంది.
​ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్, బాధ్యులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేర్యాల ఎంపీవో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, పంచాయతీ కార్యదర్శి భుక్య మధు మరియు ప్రైవేట్ వ్యక్తి షేవల్ల రమేష్‌లపై ఫిర్యాదు చేశారు. ఎంపీవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేర్యాల ఎస్. ఐ అపూర్వ రెడ్డి కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆస్తుల బదిలీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు లేదా ఇతరత్రా ఎలాంటి అక్రమ లావాదేవీల కోసమే ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.రమేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు మరికొందరి మరణ ధృవీకరణ పత్రాలు చట్ట విరుద్ధంగా జారీ చేసినట్లు సమాచారం.
​– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰
🏠 Home