🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 07 Sep, 2026 | Page: 1

ప్రభుత్వ బడికి వన్నె తెస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుడు చేగూరి దేవరాజ్

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యే ధ్యేయం.. వినూత్న కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు
రెండుసార్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.. తాజాగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్‌ మీడియా: ప్రభుత్వ పాఠశాలలో చదివి, అదే ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆదర్శ ఉపాధ్యాయుడు చేగూరి దేవరాజ్‌. విద్యార్థుల సంఖ్య పెంపుతో పాటు వినూత్న బోధనా పద్ధతులు, కిచెన్‌ గార్డెన్‌, క్రీడలు, సైన్స్‌ ప్రాజెక్టులు, సమాజ భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారు.
45 మంది నుంచి 98 మందికి..
మెదక్‌ జిల్లా రేగోడు మండలం నిర్జష్ణ పాఠశాలలో తొలిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు కేవలం 45 మంది విద్యార్థులు ఉండగా, గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రెండేళ్లలో ఆ సంఖ్యను 98కి పెంచారు. వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
2015లో కొల్చారం మండలం మాందాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వెళ్లి 62 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను 90కి పెంచారు. సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పాఠశాలలో ఆర్గానిక్‌ కిచెన్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆచరణాత్మక విద్య అందించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2017-18లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది.
నాంచారుపల్లి పాఠశాలలో ప్రత్యేక మార్పులు
2018 జూలైలో నాంచారుపల్లి యూపీఎస్‌కు వచ్చిన దేవరాజ్‌.. అప్పటికి 74 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను 2019 నాటికి 140కి పెంచారు. దాతలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, మిత్రుల సహకారంతో పాఠశాలకు పలు మౌలిక వసతులు సమకూర్చారు. విద్యార్థులను ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో ప్రోత్సహిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యేలా కృషి చేస్తున్నారు. 2025-26లో ఆయన మార్గదర్శకత్వంలో రూపొందించిన “సుస్థిర వ్యవసాయం” సైన్స్‌ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
క్షేత్ర పర్యటనల ద్వారా ప్రత్యక్ష బోధన, కిచెన్‌ గార్డెన్‌, గణిత, సైన్స్‌ దినోత్సవాలు, పట్టభద్రుల దినోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా నాంచారుపల్లి యూపీఎస్‌ పాఠశాలకు ఎస్‌సీఈఆర్టీ సక్సెస్‌ స్టోరీలో స్థానం లభించింది.
పేద విద్యార్థులకు ఉచితంగా చేతిరాత పుస్తకం
విద్యార్థుల్లో అందమైన చేతిరాతను పెంపొందించేందుకు “అందమైన చేతిరాత రాయడం ఎలా?” అనే పుస్తకాన్ని దేవరాజ్‌ రచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. వివిధ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు చేతిరాతపై ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
2023-24లో రెండోసారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న దేవరాజ్‌.. తాజాగా 2025-26 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు అద్దంకి దయాకర్‌, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలాస్‌ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు.
తనకు లభించిన పురస్కారాలు బాధ్యతను మరింత పెంచాయని, ప్రభుత్వ బడులను ఆశ్రయించే పేద విద్యార్థులకు అత్యుత్తమ, నాణ్యమైన విద్య అందించడమే తన జీవితాశయమని దేవరాజ్‌ పేర్కొంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఇలాంటి ఆదర్శ ఉపాధ్యాయులు విద్యారంగానికి నిజమైన ఆస్తి.
🏠 Home