🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 12 Oct, 2026 | Page: 1

బిర్యానీలో బైండింగ్ వైర్ కలకలం: ప్రవీణ్ బార్‌పై మున్సిపల్ కమిషనర్ అభిలాష్ ఆకస్మిక తనిఖీ..

ఫుడ్ సేఫ్టీ అధికారుల నిద్రమత్తు వీడేదెన్నడు?
​ఫుడ్ ఐటమ్‌లో వైర్ ముక్కపై స్పందించి రంగంలోకి దిగిన మున్సిపల్ యంత్రాంగం
​కిచెన్, ఆహార నిల్వల పరిశీలన.. లోపాలపై జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరిక
​కేవలం మున్సిపల్ తనిఖీలే సరిపోవు.. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ప్రజల డిమాండ్
​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
చేర్యాల పట్టణంలోని ప్రవీణ్ బార్ & రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ ఆహారంలో బైండింగ్ వైర్ ముక్క కనిపించిందంటూ వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనపై ఫిర్యాదులు రావడంతో చేర్యాల మున్సిపల్ కమిషనర్ అభిలాష్ సోమవారం తమ సిబ్బందితో కలిసి సదరు బార్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బార్‌లోని వంటగది, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, నిల్వ ఉంచిన పదార్థాల గడువు (ఎక్స్‌పైరీ డేట్లు) తదితరాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిపై నిబంధనల ప్రకారం జరిమానా విధించనున్నట్లు కమిషనర్ తెలిపారు. పట్టణంలో వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరూ పరిశుభ్రత నిబంధనలు పాటించాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే విక్రయించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
​అయితే, ఇలాంటి తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కేవలం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేసి జరిమానాలతో చేతులు దులుపుకుంటే సరిపోదని, అసలు బాధ్యత వహించాల్సిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు (ఆహార భద్రతా శాఖ) ఎక్కడ ఉన్నారని పట్టణ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, దాబాలలో ఆహార నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ నూనెలు, నాసిరకం మాంసం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ వంటి కారణాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి, తక్షణమే చేర్యాల పట్టణంలోని ఆహార నమూనాల నాణ్యతను పరీక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
​– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰
🏠 Home