🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 02 Oct, 2026 | Page: 1

జాతిపితకు చోటేది? చేర్యాల మున్సిపాలిటీ తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహo..!

రోడ్డు విస్తరణలో తొలగించి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని పాలకవర్గం, అధికారులు
​గాంధీ జయంతి నాడు కుల సంఘం విగ్రహానికే పూలమాలలు.. అధికారుల తీరుపై విమర్శలు
​ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన గాంధీ సెంటర్‌లో విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని పట్టణవాసుల డిమాండ్
​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
​చరిత్ర ఉన్న పట్టణంలో జాతిపితకు తప్పని నిర్లక్ష్యం
​ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, ఆ తర్వాత శాసనసభ నియోజకవర్గంగా వెలుగొంది, ప్రస్తుతం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన చేర్యాల పట్టణం ఎందరో బయటి వ్యక్తులకు రాజకీయ భవిష్యత్తును, జీవితాలను ఇచ్చింది. కానీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీకి మాత్రం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కాస్త చోటు ఇవ్వలేకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేర్యాల మున్సిపాలిటీ పాలకుల నిర్లక్ష్య వైఖరిపై పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
​రోడ్డు విస్తరణతో పోయిన ల్యాండ్‌మార్క్
​చేర్యాల పట్టణానికే తలమానికంగా, ప్రధాన ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన ప్రదేశం 'గాంధీ సెంటర్'. గతంలో రోడ్డు వెడల్పు పనుల పేరుతో అక్కడున్న గాంధీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. అభివృద్ధి పనుల నిమిత్తం విగ్రహాన్ని తొలగించడాన్ని ప్రజలు స్వాగతించినప్పటికీ, రోడ్డు నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా కనీసం ఆ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలన్న ఆలోచన అటు మున్సిపల్ పాలకవర్గానికి, ఇటు ఉన్నతాధికారులకు రాకపోవడం అత్యంత శోచనీయమని స్థానికులు మండిపడుతున్నారు.
​గాంధీ జయంతి వేళ అధికారుల తీరుపై విస్మయం
​అక్టోబర్ 2న దేశమంతా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటుంటే, చేర్యాల మున్సిపాలిటీలో మాత్రం అధికారికంగా ఒక గాంధీ విగ్రహం లేకపోవడం సిగ్గుచేటని ప్రజలు అంటున్నారు. జయంతి సందర్భంగా ఓ కుల సంఘం వారు ఏర్పాటు చేసుకున్న చిన్న సైజు గాంధీ విగ్రహానికి మున్సిపల్ అధికారులు పూలమాలలు వేసి చేతులు దులుపుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో జాతిపిత విగ్రహాన్ని నిలబెట్టలేకపోవడం మున్సిపల్ పాలనా వైఫల్యానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తుతున్నారు.
​వెంటనే విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి
​ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్య వైఖరిని వీడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న చేర్యాల గాంధీ సెంటర్‌లో నిబంధనల ప్రకారం వెంటనే నిలువెత్తు గాంధీ విగ్రహాన్ని శాశ్వతంగా ప్రతిష్టించి, ఆ కూడలికి పూర్వ వైభవం తీసుకురావాలని పట్టణ ప్రజలు, మేధావులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
​– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰
🏠 Home