🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 29 Sep, 2026 | Page: 1

ఇటు కోతులు...అటు కుక్కల గుంపులు.. ప్రజల తీవ్ర అవస్థలు..

ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మూగజీవాల బెడద
వీధి కుక్కలు, కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ప్రజల డిమాండ్‌
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 29, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు, కోతుల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇళ్ల పరిసరాల్లో కోతులు సంచరిస్తుండగా.. మరోవైపు వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇళ్ల ముందు, వీధుల్లో గుంపులుగా కుక్కలు సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంటాడుతుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని వారు పేర్కొంటున్నారు.
మరోవైపు కోతుల గుంపులు ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తూ ఆహారం కోసం ఇళ్లలోకి ప్రవేశించడం, వస్తువులను చిందరవందర చేయడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీంతో కోతులు, వీధి కుక్కల బెడదకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణకు శాస్త్రీయ, చట్టబద్ధమైన పద్ధతుల్లో చర్యలు చేపట్టడంతో పాటు కోతుల సమస్య పరిష్కారానికి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు.
కేవలం తాత్కాలిక చర్యలతో సమస్యను వదిలేయకుండా గ్రామాల వారీగా సమస్యను గుర్తించి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపడతారా? లేదా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
🏠 Home