🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Sep, 2026 | Page: 1

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి :AIFB

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి
విద్యాశాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: విద్యార్థి నేతల డిమాండ్‌
సిద్దిపేట, సెప్టెంబర్‌ 24, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ హాజరై రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, అవసరమైన నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని రాజశేఖర్ గౌడ్ కోరారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని రాష్ట్ర ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యదర్శి అందె బీరన్న విమర్శించారు. విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యారంగానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులు, పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలను ప్రజలకు వెల్లడిస్తూ పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, తాళ్లపల్లి గణేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home