🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Sep, 2026 | Page: 1

విద్యార్థుల హక్కుల పరిరక్షణే లక్ష్యం: ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్

విద్యా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమం
చేర్యాలలో ఘనంగా ఏఐఎస్‌ఎఫ్‌ సిద్దిపేట జిల్లా 5వ మహాసభలు
చేర్యాల, సెప్టెంబర్‌ 24, హిందుస్థాన్ మీడియా:
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) సిద్దిపేట జిల్లా 5వ మహాసభలు చేర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మహాసభల సందర్భంగా పట్టణ కేంద్రంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం చేర్యాలలోని వాసవి గార్డెన్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ జెండాను జిల్లా నిర్మాణ బాధ్యులు మంద పవన్‌ ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పుట్ట లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు, విద్యా రంగ పరిరక్షణ కోసం ఏఐఎస్‌ఎఫ్‌ నిర్వహించిన ఉద్యమాల చరిత్రను వివరించారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి విద్యార్థుల సమస్యలపై సంఘం నిర్వహించిన పోరాటాలు, విద్యార్థుల హక్కుల సాధనలో ఏఐఎస్‌ఎఫ్‌ పోషించిన పాత్రను ప్రస్తావించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై ఏఐఎస్‌ఎఫ్‌ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌ సౌకర్యాలు, నిరుద్యోగం వంటి అంశాలపై విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పుట్ట లక్ష్మణ్‌ అన్నారు. విద్యార్థులు తమ హక్కులు, విద్యారంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అవగాహన పెంచుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నిర్మాణ బాధ్యులు మంద పవన్‌ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్‌ఎఫ్‌ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
మహాసభల్లో మాజీ నాయకులు బట్టు దయానందరెడ్డి, స్వర్గం రాజేశం, నర్సింహారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగెం మధు, జేరిపోతుల జనార్దన్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామగళ్ల నరేష్‌, సహాయ కార్యదర్శులు వేల్పుల ప్రసన్నకుమార్‌, చిట్యాల శేఖర్‌, నాయకులు, మండల నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.అనంతరం మహాసభల్లో ఏఐఎస్‌ఎఫ్‌ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నాయకులు తెలిపారు.
🏠 Home