🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 22 Sep, 2026 | Page: 1

సైబర్ నేరాలపై డి ఐ సంతోష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

మహిళల భద్రత, రోడ్డు భద్రతపై ప్రత్యేక సూచనలు
నేరం జరిగినా.. అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 21, హిందుస్థాన్ మీడియా:
ఇటీవల వరుస దొంగతనాలు, సైబర్‌ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హయత్‌నగర్‌ డీఐ సంతోష్‌ సూచించారు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు కుంట్లూర్‌ పరిధిలోని జయప్రకాష్‌ నగర్‌ కాలనీలోని పలు వినాయక మండపాల వద్ద సోమవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఐ సంతోష్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాలు, ఓటీపీ, పిన్‌ వంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.
అదేవిధంగా మహిళల భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత నేరాల వైపు మళ్లే ప్రమాదం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఎవరైనా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో 112ను సంప్రదించాలని తెలిపారు.
ప్రజలకు ఉపయోగపడే విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసు సిబ్బందికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటామని, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరిస్తామని చెప్పారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కాలనీలో పోలీసు పెట్రోలింగ్‌ మరింత పెంచాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్‌కుమార్‌, కాలనీ అధ్యక్షుడు సముద్రాల సుధాకర్‌, కాలనీ సభ్యులు రామయ్య, బాబురావు, నరసింహ, జహంగీర్‌, హజీరా బేగం, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home