🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 15 Sep, 2026 | Page: 1

గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ ఆధ్వర్యంలో నానో యూరియా పై రైతులకు అవగాహన

ఎకరానికి లీటర్‌ నానో యూరియా సరిపోతుంది
డ్రోన్‌ ద్వారా కూడా పంటలకు స్ప్రే చేసుకోవచ్చు: ఏడీఏ బాబు నాయక్
సిద్దిపేట జిల్లా, కుకునూర్‌పల్లి, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: నానో యూరియా వినియోగం, పంటల్లో దాని ఉపయోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కుకునూర్‌పల్లి మండలం మేదినీపూర్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ ఆధ్వర్యంలో గజ్వేల్ వ్యవసాయ డివిజన్ అధికారి బాబు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు నానో యూరియా వినియోగంపై వివరించారు.
ఈ సందర్భంగా ఏడీఏ బాబు నాయక్ మాట్లాడుతూ వివిధ పంటల్లో ఏ దశలో నానో యూరియాను ఎలా వినియోగించాలి అనే అంశాలను రైతులకు వివరించారు. సాధారణ యూరియాతో పోలిస్తే నానో యూరియా వినియోగంతో మొక్కలకు నత్రజని అందుబాటులో ఉండటంతో పాటు రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.
నానో యూరియా వినియోగం వల్ల నేల, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు తోడ్పడటంతో పాటు గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. సాధారణ యూరియా వినియోగ సామర్థ్యం 30–40 శాతం వరకు ఉండగా, నానో యూరియా వినియోగ సామర్థ్యం 80–85 శాతం వరకు ఉంటుందని వివరించారు.
రైతులు నానో యూరియాను డ్రోన్‌ ద్వారా కూడా పంటలపై స్ప్రే చేసుకోవచ్చని, ఒక ఎకరానికి ఒక లీటర్‌ నానో యూరియా సరిపోతుందని తెలిపారు. పంటల అవసరానికి అనుగుణంగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నానో యూరియాను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూరుగు మధుమోహన్, వ్యవసాయ అధికారి గోవిందరాజు, మండల పంచాయతీ అధికారి నాగభూషణం, ఏఈఓ రమ్యశ్రీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. నానో యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
🏠 Home