🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 15 Sep, 2026 | Page: 1

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందేలా చూడాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

నేటి నుంచి ఈ నెల 25 వరకు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్
రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుదారుల నివాస స్థితి, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, పెన్షన్ కేటగిరీ, అర్హత ప్రమాణాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలని ఆదేశించారు.
అర్హత ఉన్న దరఖాస్తులను స్పష్టంగా గుర్తించడంతో పాటు అనర్హత ఉన్న దరఖాస్తులకు నిర్దిష్ట కారణాలను చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఏడు కేటగిరీల దరఖాస్తులపై ప్రత్యేక పరిశీలన
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులకు సంబంధించిన దరఖాస్తుల్లో సమర్పించిన పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
వితంతు మహిళలు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఒంటరి మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయసు ఉండాలని, సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
గీత కార్మికులకు 50 ఏళ్ల వయసు ఉండడంతో పాటు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ పత్రం, గీత కార్మికుల సొసైటీలో సభ్యత్వం ఉండాలని తెలిపారు. నేత కార్మికులకు 50 ఏళ్ల వయసుతో పాటు హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖ గుర్తింపు పత్రం ఉండాలని సూచించారు. పైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ పత్రం, డయాలసిస్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వివరాలు ఉండాలని తెలిపారు.
దివ్యాంగులకు సదరం శిబిరం ద్వారా మంజూరైన 40 శాతం వైకల్య ధ్రువీకరణతో కూడిన యూడీఐడీ పత్రం, చెవిటివారికి 51 శాతం వైకల్య ధ్రువీకరణతో కూడిన యూడీఐడీ పత్రం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి చేయూత పెన్షన్ ప్రయోజనం అందేలా పరిశీలన ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సంతోష్, డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home