🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 15 Sep, 2026 | Page: 1

బైరాన్ పల్లి మహిళల పోరాటం స్ఫూర్తిదాయకం: మల్లు లక్ష్మి

నిజాం, రజాకారులు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా మహిళలు వీరోచితంగా పోరాడారు
బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తాం: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బైరాన్‌పల్లి మహిళలు సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరవనితలను స్మరించుకుంటూ ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్ఫూర్తి యాత్ర మంగళవారం పాలకుర్తిలో ప్రారంభమై కడవెండి మీదుగా వీర బైరాన్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్రకు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు.
బైరాన్‌పల్లి బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన సభలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ 1946–51 మధ్య తెలంగాణ ప్రాంతంలో సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో మహిళలు వీరోచితంగా పోరాడి అమరులయ్యారని గుర్తుచేశారు. నిజాం పాలనలో బైరాన్‌పల్లి బురుజు వద్ద మహిళలపై జరిగిన అమానవీయ దాడులను ఆమె ప్రస్తావించారు.
నిజాం, రజాకారులు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా మహిళలు ఇంటికే పరిమితం కాకుండా చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో తెగువతో ఉద్యమించి పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని మల్లు లక్ష్మి అన్నారు. మహిళల పోరాట స్ఫూర్తితోనే బైరాన్‌పల్లి గడ్డ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు.
నాడు వీరవనితలు సాధించిన పోరాట ఫలితాలు నేటి సమాజంలోని మహిళలకు స్ఫూర్తినిస్తున్నాయని ఆమె అన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ మహిళల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐద్వా ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ స్ఫూర్తి యాత్రలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఆశాలత, బుగ్గవీటి సరళ, బండి పద్మ, మేరుగు రమణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన, కార్యదర్శి అత్తిని శారద, సహాయ కార్యదర్శి జాలిగాకు శిరీష, ఇపకాయల శోభ, నాయకురాళ్లు విఘ్నేశ్వరి, చంద్రకళ, శోభ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home