🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 15 Sep, 2026 | Page: 1

సెప్టెంబర్ 17న జరిగే సంస్మరణ సభను జయప్రదం చేయండి : సీపీఎం నాయకులు

బైరాన్‌పల్లి బురుజు వద్ద సభా ఏర్పాట్లను పరిశీలించిన సీపీఎం నాయకులు
సభకు బీవీ రాఘవులు, చుక్క రాములు ముఖ్య అతిథులు
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న వీరభైరాన్‌పల్లిలో నిర్వహించనున్న బైరాన్‌పల్లి అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ బృందం బైరాన్‌పల్లి అమరవీరుల స్మారక చిహ్నమైన బురుజును, సభ నిర్వహించనున్న ప్రదేశాన్ని పరిశీలించింది. ఈ నెల 17న జరిగే సంస్మరణ సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బైరాన్‌పల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలపై పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని అన్నారు. ఈ నెల 17న జరిగే సంస్మరణ సభకు మేధావులు, ప్రజాతంత్రవాదులు, రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్ మామ, ఆలేటి యాదగిరి, చొప్పరి రవికుమార్, ఎం.డి. షఫీ, పోతిరెడ్డి రాజు, తుప్పది రాజు, వేల్పుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home