🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 05 Sep, 2026 | Page: 1

చేర్యాలలో ఫంక్షన్ హాల్ డెకరేషన్ల సిండికేట్ దందా..

కమిషన్ల కక్కుర్తితో ప్రజలపై మోయలేని భారం!
​లీజుల పేరుతో గుత్తాధిపత్యం.. బయటి వారికి అనుమతిస్తే రూ. 5 వేల నుంచి 10 వేల వరకు జరిమానా వసూళ్లు
​పాలు, మద్యం నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు దందా రాజ్యం.. చోద్యం చూస్తున్న అధికారులు
​సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని సామాన్యుల డిమాండ్
​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
​చేర్యాలలో విస్తరిస్తున్న సిండికేట్ మాఫియా
​ఇప్పటివరకు వ్యాపారాల్లో మద్యం, ఇసుక సిండికేట్ల గురించి విన్నాం.. కానీ చేర్యాల పట్టణ కేంద్రంలో పాల వ్యాపారం నుంచి మద్యం దుకాణాలు, చివరకు ఫంక్షన్ హాళ్ల డెకరేషన్ల వరకు సిండికేట్ ముఠా దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు ఒక కూటమిగా ఏర్పడి కృత్రిమ నియమాలను సృష్టిస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. కష్టపడకుండా కమిషన్ల రూపంలో అక్రమ సంపాదనకు అలవాటుపడి ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
​లీజుల పేరిట కమిషన్ల దోపిడీ
​శుభకార్యాలు చేసుకునేందుకు వచ్చే ప్రజలను ఫంక్షన్ హాల్ యజమానులు, డెకరేషన్ వ్యాపారులు కుమ్మక్కై నిలువునా దోచుకుంటున్నారు. స్థానిక ఫంక్షన్ హాళ్లలో ఒక్కో డెకరేషన్ నిర్వాహకుడు ముందస్తుగా లీజు పేరిట ఒప్పందాలు చేసుకుని గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. ఆ హాల్లో తమ డెకరేషన్ మాత్రమే ఉండాలని, వేరే బయటి వ్యక్తులతో డెకరేషన్ చేయిస్తే ఏకంగా రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు అదనపు కమిషన్ చెల్లించాలని బెదిరింపులకు దిగుతున్నారు.
​సామాన్యుడిపై పడుతున్న అదనపు భారం
​డెకరేషన్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్న ఈ అదనపు కమిషన్ మొత్తాన్ని ఫంక్షన్ హాల్ యాజమాన్యాలు శుభకార్యాలు చేసుకునే సామాన్య ప్రజల నుంచే బలవంతంగా వసూలు చేస్తున్నాయి. మార్కెట్ ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తూ, నచ్చిన వారి వద్ద డెకరేషన్ చేయించుకునే స్వేచ్ఛ లేకుండా ప్రజలను బంధిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం అప్పులు చేసి ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకునే సామాన్యులకు ఈ కమిషన్ల దందా పెనుభారంగా మారింది.
​అధికారులు ప్రేక్షకపాత్ర వీడాలి
​పట్టణంలో ఇంత బహిరంగంగా దందా నడుస్తున్నా సంబంధిత మున్సిపల్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో స్పందించి, ఫంక్షన్ హాళ్లలో సాగుతున్న ఈ అక్రమ సిండికేట్ విధానంపై విచారణ జరపాలని, వినియోగదారులను పీల్చిపిప్పి చేస్తున్న కమిషన్ల కక్కుర్తికి శాశ్వతంగా స్వస్తి పలకాలని చేర్యాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
​– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰
🏠 Home