🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Aug, 2026 | Page: 1

ఎల్లారెడ్డిపేటలో ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
చేయూత పెన్షన్ దరఖాస్తులపై ఆరా
హిందుస్థాన్ మీడియా, ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 24: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహిస్తున్న మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రజావాణికి హాజరైన వివిధ శాఖల మండలస్థాయి అధికారుల వివరాలను పరిశీలించిన కలెక్టర్, గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చేయూత నూతన పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించి, లబ్ధిదారుల దరఖాస్తులపై ఆరా తీశారు.
చేయూత పెన్షన్‌లకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు ప్రజావాణి ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. మండల ప్రజలు తమ సమీప మండల కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణుతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home