🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 22 Aug, 2026 | Page: 1

లద్నూర్ రిజర్వాయర్ ను పరిశీలించిన కేంద్ర నిపుణుల బృందం

లీకేజీలపై ప్రత్యేక దృష్టి.. సాగు భూముల వినియోగంపై కీలక సూచనలు
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని లద్నూరు రిజర్వాయర్‌ను కేంద్ర నిపుణుల బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రిజర్వాయర్ ఎక్స్‌పర్ట్, చైర్మన్ విజయ్ దేశాయ్, జియోటెక్నికల్ ఎక్స్‌పర్ట్ కృష్ణయ్య, శ్రీకాంత్ తదితరులతో కూడిన బృందం రిజర్వాయర్‌ను పరిశీలించి పలు అంశాలపై అధికారులకు సూచనలు చేసింది.రిజర్వాయర్‌లోని నీటి నిల్వ పరిస్థితి, కట్ట పటిష్టత, కట్ట కింద భాగంలో కనిపిస్తున్న నీటి లీకేజీలు, రిజర్వాయర్ పరిధిలో సాగు చేస్తున్న భూములు, రహదారి నిర్మాణ పనులను నిపుణులు పరిశీలించారు. రిజర్వాయర్ భద్రత దృష్ట్యా ప్రస్తుతం రిజర్వాయర్ పరిధిలో సాగు చేస్తున్న పొలాలను ఇకపై వినియోగించవద్దని నిపుణుల బృందం సూచించింది.
సాగు భూములను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు, సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
అలాగే రిజర్వాయర్ కట్ట కింద చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన నిపుణులు, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కట్ట కింద కనిపిస్తున్న నీటి లీకేజీలను ప్రత్యేకంగా పరిశీలించి వాటికి గల కారణాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.
లీకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన మరమ్మతు పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏఈకి నిపుణుల బృందం సూచించింది. రిజర్వాయర్ భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు కట్ట పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొంది.ఈ పరిశీలనలో సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొని రిజర్వాయర్‌కు సంబంధించిన వివరాలను నిపుణుల బృందానికి వివరించారు.
🏠 Home