🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 21 Aug, 2026 | Page: 1

జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులతో బిఆర్ఎస్వీ ధర్నా

పాలిటెక్నిక్ వ్యవస్థను స్వతంత్రంగా కొనసాగించాలి: బీఆర్‌ఎస్‌వీ
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ/శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేర్యాల బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా, ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చేర్యాల బీఆర్‌ఎస్‌వీ పట్టణ అధ్యక్షుడు ఒగ్గు శ్రీశైలం మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు అందుతున్న ధ్రువపత్రాల విలువ, ఉన్నత విద్యలో ప్రవేశ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలపై అనుమానాలు నెలకొంటున్నాయని అన్నారు.
ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ఎస్‌బీటీఈటీ గుర్తింపు, విధానాల్లో మార్పులు వస్తాయనే ఆందోళన విద్యార్థుల్లో ఉందన్నారు. డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్‌తో పాటు ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లోకి వెళ్లే అవకాశాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలను ‘శక్తి’ పథకం/యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను స్వతంత్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
జీవో 97ను రద్దు చేయకపోతే బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బోధసు రుద్ర, సాక్షిత్, అనిల్, చందు, రాజు, వినయ్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home