🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 20 Aug, 2026 | Page: 1

జిల్లా డీడబ్ల్యూఓ ఏకపక్ష వైఖరిని మార్చుకోవాలి:ఎన్‌పీఆర్‌డీ

జిల్లా స్థాయి కమిటీలో ఎన్‌పీఆర్‌డీకి ప్రాతినిధ్యం కల్పించాలి
అధిక మద్దతు అవసరమైన వికలాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి
ఎన్‌పీఆర్‌డీ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్
హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట, ఆగస్టు 19: వికలాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయాల్సిన జిల్లా స్థాయి కమిటీలో తమ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌పీఆర్‌డీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమ సంఘం అనేకసార్లు జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, తమను పక్కనపెట్టి డీడబ్ల్యూఓకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే సమాచారం అందించి కమిటీ ఏర్పాటు చేయడం ఏకపక్ష వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016 ప్రకారం వికలాంగుల సంక్షేమం, చట్టం అమలు, పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు అవసరమని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో కూడా సమగ్ర ప్రాతినిధ్యంతో కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
డీడబ్ల్యూఓ తన వైఖరిని మార్చుకోకపోతే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అధిక మద్దతు అవసరమైన వికలాంగులకు ప్రత్యేక రాయితీలు
వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం అధిక మద్దతు అవసరమైన వికలాంగులకు ప్రత్యేక రాయితీలు, అవసరమైన సహాయ చర్యలు కల్పించాలని కోరారు. చట్టంలోని అంశాలపై జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు జి. భాస్కర్, జిల్లా అధ్యక్షులు ఎం.డి. సాజిద్, చేర్యాల డివిజన్ అధ్యక్షులు తుమ్మలపల్లి అనిల్, ఉపాధ్యక్షులు తాండ్ర సత్తయ్య, ప్రధాన కార్యదర్శి బయ్యారపు ఆంజనేయులు, సహాయ కార్యదర్శి పర్వతం మల్లయ్య, జిల్లా నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, వేల్పుల యాదగిరి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home