🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 18 Aug, 2026 | Page: 1

వరి నుంచి ఆయిల్ పామ్ వైపు రైతుల అడుగులు...

దాచారంలో 19 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
పంటను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: సంప్రదాయ వరి సాగుకు బదులుగా దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగువైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు 19 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు.దాచారం గ్రామానికి చెందిన సురభి రవీందర్ రావు 10 ఎకరాల్లో, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో గతంలో వరి సాగు చేసేవారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న వారు వరి సాగుకు స్వస్తి పలికి ఆయిల్‌పామ్ సాగును చేపట్టారు.
386 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం ఉద్యానవన, వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు.దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 386 ఎకరాల్లో రైతులు వరి నుంచి ఆయిల్‌పామ్ సాగులోకి మారినట్లు అధికారులు తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
దాచారంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ పంటను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. రైతులను అభినందించిన ఆమె ఆయిల్‌పామ్ సాగు వైపు మరింత మంది రైతులు ముందుకు రావాలని సూచించారు.
ఆయిల్‌పామ్ మొక్కలు నాటిన అనంతరం సుమారు మూడు సంవత్సరాల పాటు అంతర పంటలు సాగు చేసుకోవచ్చని, తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు, సాంకేతిక సలహాలు పాటిస్తూ ఆయిల్‌పామ్ సాగు చేపడితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home