🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 18 Aug, 2026 | Page: 1

భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ

ప్రతి కార్మికుడు లేబర్ కార్డు పొందాలి: రాష్ట్ర అధ్యక్షుడు ముస్త్యాల గణేష్
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని ఎల్లమ్మ దేవాలయ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముస్త్యాల గణేష్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముస్త్యాల గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. కార్మికులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, హక్కులను పొందేందుకు లేబర్ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రమాద బీమా, వివాహ కానుక, ప్రసూతి సహాయం, ప్రమాద సమయంలో జీవన భృతి, కార్మికుల పిల్లలకు విద్యా సహాయం, ఆరోగ్య పథకాలు తదితర ప్రయోజనాలు అర్హత మేరకు పొందవచ్చని వివరించారు.
ఇటుక బట్టీ కార్మికులు, తాపీ కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రికల్ కార్మికులు, ఐరన్ వర్కర్లు, సిమెంట్ గోదాం కార్మికులు తదితర భవన నిర్మాణ రంగ కార్మికులందరూ తమ పరిధిలోని కార్మిక సంఘాల ద్వారా నమోదు చేసుకుని లేబర్ కార్డులు పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక రంగాల సమైక్య ఏఐటీయూసీ నాయకులు రామగల్ల నరేష్, బండయ్య అశ్విని, పశువుల నవీన్, ముత్యాల రత్నాకర్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
🏠 Home