🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 17 Aug, 2026 | Page: 1

నేనున్నాను.. అమ్మ..ధైర్యంగా ఉండండి. విద్యార్థినిలకు కలెక్టర్ హైమావతి భరోసా..!

మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆసుపత్రి, కేజీబీవీలో కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 17: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజనం అనంతరం 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో పాఠశాల సిబ్బంది 108 వాహనం ద్వారా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్
ఘటనపై సమాచారం అందుకున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సోమవారం సాయంత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేజీబీవీని, చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ పరామర్శించారు. ఒక్కో బెడ్ వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ధైర్యం చెబుతూ “నేనున్నాను అమ్మ.. ఏం కాదు.. ధైర్యంగా ఉండండి” అంటూ భరోసా కల్పించారు.
వైద్యులను పిలిపించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ప్రత్యేక వైద్య నిపుణులను రప్పించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
కేజీబీవీ వంటగది, స్టోర్‌రూమ్‌లో తనిఖీలు
ఆసుపత్రి నుంచి నేరుగా కేజీబీవీకి చేరుకున్న కలెక్టర్ పాఠశాల వంటగది, స్టోర్‌రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో డ్రైనేజీ నీరు చేరుతున్న విషయాన్ని గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థినుల అస్వస్థతకు ఆహారం కారణమా, ఇతర కారణాలా అనే అంశంపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉంది. ఆహార నమూనాలను పరీక్షించి వాస్తవ కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్, డీఎంహెచ్‌ఓ ధనరాజ్, తహసీల్దార్ రహీం, ఎంపీడీవో రామ్మోహన్, ఎస్‌ఐ అసిఫ్, ఎంఈఓ వరదరాజులు, గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం, కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home