🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 09 Aug, 2026 | Page: 1

రైతుల జీవితాల్లో మార్పు రావాలన్న కల సాకారం : మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేటను దక్షిణ భారతదేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో అగ్రస్థానంలో నిలుపుతాం
హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు, ఆగస్టు 9: రాబోయే రోజుల్లో సిద్దిపేట జిల్లా ఆయిల్‌పామ్‌ సాగులో దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
ఆదివారం చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నారాయణరావుపేట మండలం గోపులాపూర్‌లో ఆయిల్‌పామ్‌ మొక్కను నాటారు. అనంతరం మేడిపల్లిలో రైతు పాపిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటలో గెలల కోతను పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రైతుల జీవితాల్లో ఆర్థిక మార్పు తీసుకురావాలన్న తన ఐదేళ్ల కల ఆయిల్‌పామ్‌ సాగుతో సాకారమవుతోందని అన్నారు. ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించినప్పుడు, సిద్దిపేట రైతులు కూడా అదే విధంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
50 వేల ఎకరాలకు ఆయిల్‌పామ్‌ సాగు
సిద్దిపేట ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలు, తేమ శాతం పెరగడంతో ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి రంగంలో మార్పులు సాధ్యమయ్యాయని అన్నారు.
ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో 5,322 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు జరుగుతుండగా, 301 ఎకరాల్లో పంట కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. భవిష్యత్‌లో ఆయిల్‌పామ్‌ సాగును 50 వేల ఎకరాలకు విస్తరించి సిద్దిపేటను రాష్ట్రానికి దిక్సూచిగా మారుస్తామని అన్నారు.
ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు ఆదాయాన్ని అందించడంతో పాటు సమాజానికి, పర్యావరణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం కస్తూరిపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సర్పంచులు సదానందం, స్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home