🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 07 Aug, 2026 | Page: 1

ఆగస్ట్ 10న జరిగే జైల్ భరో ను విజయవంతం చేయాలి

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న ఉద్యమానికి ప్రజలు తరలిరావాలి: ప్రజాసంఘాల నేతలు
హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొమురవెల్లి, అయినాపూర్ గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి రవీందర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుద్ధిపడిగె కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు, పేదల ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల బలహీనీకరణ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం, గ్రామీణ ఉపాధి అవకాశాల తగ్గింపు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
నాలుగు లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, ఎనిమిది గంటల పని విధానం, ట్రేడ్ యూనియన్ హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజుల పని, రోజుకు రూ.600 కనీస వేతనం ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించే ఆగస్టు 10 జైల్ భరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తేలు ఇస్తారీ, బక్కిలి బాలకిషన్, ఆరుట్ల రవీందర్, గాంధారి శ్రావణ్ చారి, తాడూరి భరత్ కుమార్, కానుగుల రాజు, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home